
- గోదావరిలో కావాల్సినన్ని నీళ్లు.. ఎవరి శక్తి మేరకు వాళ్లు తీసుకోవచ్చు: చంద్రబాబు
- తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటదో కట్టుకోవచ్చు
- సముద్రంలో కలిసే నీటిని మాత్రమే మేం వాడుకుంటాం
- బేసిన్స్ లో వాటాలపై మేమెందుకు ఎన్వోసీ ఇస్తాం
- కృష్ణా నీళ్ల వాటా ట్రిబ్యునల్‌లోనే తేలుతుంది
- రెండు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీలు వద్దని వ్యాఖ్య
హైదరాబాద్ , వెలుగు: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీలు వద్దని, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బనకచర్లపై కేంద్రం దగ్గర కూర్చొని మాట్లాడుకుందామని చెప్పారు. గురువారం అమరావతిలో మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. విభజన చట్టంలో భాగంగా పోలవరం నిర్మిస్తున్నామని, సముద్రంలో కలిసే వృథా నీటినే బనకచర్ల ద్వారా తరలించాలనుకుంటున్నామని, దీనివల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు. ‘‘గోదావరిలో ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి. 100 ఏండ్ల లెక్కలు ఇదే విషయం చెప్తున్నాయి. రెండు రాష్ట్రాలు ఎవరి శక్తి మేరకు వాళ్లు నీటిని వాడుకోవచ్చు. తెలంగాణ.. ఎగువన ఉన్న రాష్ట్రం. మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటారో కట్టుకోండి.
మీ ప్రాజెక్టులకు వాడుకున్న తర్వాత కిందికి వచ్చే వృథా నీటినే మేం వాడుకుంటాం. తెలంగాణతో నేను ఎప్పుడైనా గొడవపడ్డానా? తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కట్టినప్పుడు నేను అభ్యంతరం చెప్పలేదు. బనకచర్లపై ఎందుకు అభ్యంతరం చెప్తున్నారో అర్థం కావట్లేదు” అని చంద్రబాబు అన్నారు. బేసిన్స్‌లో వాటాలపై తాము ఎందుకు ఎన్వోసీ ఇస్తామని ప్రశ్నించారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయని, అక్కడ ఎలాంటి సమస్య లేదని, సమస్యంతా కృష్ణా నీటితోనే అని చెప్పారు. ‘‘కృష్ణాలో తక్కువ నీళ్లున్నాయి. అందులో ఎవరి వాటా ఎంతో ట్రిబ్యునల్ తేలుస్తుంది కాబట్టి ఎలాంటి సమస్య ఉండబోదు. ఉమ్మడి రాష్ట్రంలో దేవాదుల, కల్వకుర్తి లాంటి ప్రాజెక్టులను మేమే కట్టాం. హైదరాబాద్‌ను డెవలప్చేశాం. దాని ఫలితాలు ఇప్పుడు అందుతున్నాయి. తెలంగాణకు 75 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తున్నది. ఇది నాకు ఎంతో సంతృప్తినిస్తున్నది” అని చంద్రబాబు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు కలిసిమెలిసి అభివృద్ధిలో నంబర్‌వన్‌గా ఉండాలన్నదే తన తాపత్రయమని అన్నారు. కానీ రాజకీయాల కోసం గొడవ పడ్తూ ప్రజల్ని మభ్యపెట్టడం సరికాదని తెలిపారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గొడవలు పడుతుంటే మిగతా వాళ్లు రాజకీయంగా పబ్బం గడుపుకుంటారని, దీని వల్ల ఎలాంటి లాభం ఉండదని ఆయన అన్నారు.