నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదు: చంద్రబాబు

నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదు: చంద్రబాబు

కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 9పేజీల లేఖ రాశారు.ఏపీలోని ప్రాజెక్టులపై సమీక్షను అడ్డుకోవద్దంటూ ఆయన లేఖలో కోరారు. ఈసీ తీసుకున్న పలు నిర్ణయాలు ఏకపక్షమని, ప్రజాప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. శాఖల రివ్యూలపై ఈసీ అభ్యంతరాలు సరికాదన్నారు.

సీఎం భద్రత చూస్తున్న ఇంటెలిజెన్స్ డీజీ, ఎస్పీ బదిలీలు ఏకపక్ష నిర్ణయమన్నారు. వైసీపీ చేసిన ఫిర్యాదులపై వెంటనే నిర్ణయాలు తీసుకున్న ఈసీ, తమ పార్టీ చేసిన ఏ ఫిర్యాదు పైనా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఫిర్యాదు చేసిన తమ పార్టీ నేతలను ఆధారాలు లేని కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారన్నారు.

ముఖ్యమంత్రి హోదాలో తాను తాగునీరు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, విపత్తు నిర్వహణ తదితర అంశాలపై సమీక్షలు చేయాలని నిర్ణయించుకున్నానని, సమీక్షలు నిర్వహించకపోవడం వల్ల రాష్ట్రంలో పాలన కుంటుపడుతోందని బాబు అన్నారు.

ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్ విధి నిర్వహణలో ఈసీ దారుణంగా విఫలమైందని, ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోవడంలో ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు  ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారన్నారు. తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నికలప్పుడు ఇలాంటి ఘటనలు చూడలేదని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు.