సీఎం రేవంత్​కు లేఖ రాసిన ఏపీ సీఎం చంద్రబాబు

సీఎం రేవంత్​కు లేఖ రాసిన ఏపీ సీఎం చంద్రబాబు
  •   విభజన హామీలపై చర్చిద్దామని ప్రతిపాదన

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం లేఖ రాశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలపై చర్చించేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేద్దామంటూ చంద్రబాబు ప్రతిపాదించారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం, ఇరు రాష్ట్రాల పురోగతి, రాష్ట్రాల మధ్య సహకారం అంశాలపై రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తుంటానంటూ లేఖలో పేర్కొన్నారు. 

ఈ భేటీతో సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నానని, జులై 6న భేటీ కావాలని యోచిస్తున్నట్టు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ‘‘తెలంగాణ సీఎంగా మీరు చేస్తున్న విశేషమైన కృషికి అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అంకితభావం, నాయకత్వం తెలంగాణ పురోగతి, అభివృద్ధికి గొప్ప సహకారం అందిస్తున్నాయి. ఏపీ, తెలంగాణల స్థిరమైన అభివృద్ధి, శ్రేయస్సు విషయంలో తెలుగు రాష్ట్రాల సీఎంలుగా సన్నిహిత సహకారం ముఖ్యం. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఉమ్మడి లక్ష్యాల దృష్ట్యా సహకారం అవసరం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సానుకూల స్పందన

చంద్రబాబు లెటర్ పై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఇదే విషయమై చంద్రబాబుకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి లెటర్ రాయనున్నారు. ప్రజా భవన్ లో ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యే అవకాశం ఉన్నది. పక్క రాష్ట్రంతో సఖ్యతగా ఉంటామని మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అపరిష్కృత అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుందామనే  ధోరణిలో ఉన్నారు.