దసరాకే విశాఖ నుంచి పాలన... విశాఖ వందనం పేరుతో కార్యక్రమం: వైవీ సుబ్బారెడ్డి

దసరాకే విశాఖ నుంచి పాలన... విశాఖ వందనం పేరుతో కార్యక్రమం: వైవీ సుబ్బారెడ్డి

విశాఖపట్నంలో సీఎం కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన చర్యలు దశల వారీగా చేపడతామని, విజయదశమి నుంచి పాలనకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఇప్పటికే కమిటీ వేసినట్లు వైఎస్సార్‌సీపీ నేత వైవి సుబ్బారెడ్డి తెలిపారు. అక్టోబర్ 15వ తేదీ నుంచి విశాఖ రాజధానిని స్వాగతిస్తూ భారీ కార్యక్రమం చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలిపారు. విశాఖ వందనం పేరుతో అన్ని వర్గాల ప్రజలతో కార్యక్రమం నిర్వహిస్తామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. విశాఖ రాజధాని జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన భేటీకి శనివారం (సెప్టెంబర్ 23)  మంత్రి గుడివాడ అమర్నాథ్ తో కలిసి వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. అన్ని సమకూర్చుకున్న తర్వాతే విజయదశమి నుంచి విశాఖ నుంచి సీఎం జగన్ పాలనా ముహూర్తం ఖరారు అయిందని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఆలోచన చేశారని చెప్పారు.  ఇప్పుడు ఈ రాజధానులు ఏర్పడకపోతే మళ్లీ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ విశాఖకు వస్తే ఇక్కడ అనేక ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయన్న ఆలోచనను పూర్తిగా తుడిచి వేసే విధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాలని సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకే ఈ మూడు రాజధానుల ఏర్పాటు అని సుబ్బారెడ్డి తెలిపారు. 

సీఎస్ జవహర్ రెడ్డి కీలక సమావేశం

వీఎంఆర్‌డీలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాజధాని బిల్డింగ్‌ల ఎంపిక, సన్నద్ధతపై సీఎస్ చర్చించారు. విశాఖలో రాజధాని ఏర్పాట్లపై అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రాక కోసం విశాఖలో జరిగే మౌలిక సదుపాయాలు, అభివృద్ధిని త్వరలో అందరూ చూస్తారని అన్నారు. విశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించామని తెలిపారాయన. విశాఖలో ఇప్పటికే ఆమోదం పొందిన జాతీయ స్థాయి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌ల అమలు కోసం కొన్ని సూచనలు చేశామని జవహర్ రెడ్డి తెలిపారు. నీతి ఆయోగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 20 నగరాలలో విశాఖ ఒకటి కావడం శుభ పరిణామమని.. 2047 వికసిత్ భారత్ కోసం ఎంపిక చేసిన నాలుగు నగరాలలో విశాఖ ఒకటని ఈ సందర్భంగా సీఎస్‌ జవహర్ రెడ్డి ప్రస్తావించారు.