చంద్రబాబు కూల్చిన ఆలయాలను మళ్లీ నిర్మించి.. ప్రారంభించిన జగన్​

చంద్రబాబు కూల్చిన ఆలయాలను మళ్లీ నిర్మించి.. ప్రారంభించిన జగన్​

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​  గురువారం ( డిసెంబర్​7) విజయవాడ దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.    ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని ఆయనకు అందించారు. 

 ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) రూ.216 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ (Master Plan) ప్రకారం నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడ దుర్గగుడిని రూ.225 కోట్లతో పూర్తిగా అభివృద్ధి చేసేందుకు సర్కారు మాస్టర్ ప్లాన్ రూపొందించి....  సీఎం జగన్​  వాటికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనల అనంతరం పూర్తైన నిర్మాణాలను ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం పూర్తైన అనంతరం సీఎం తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

అభివృద్ధి పనులివే

 • రూ.57 కోట్ల రాష్ట్ర నిధుల్లో రూ.30 కోట్లతో అన్న ప్రసాద భవన నిర్మాణం
   
 • రూ.27 కోట్లతో ప్రసాదం పోటు భవన నిర్మాణం, రూ.13 కోట్లతో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, రూ.15 కోట్లతో రాజగోపురం ముందు భాగం వద్ద మెట్ల నిర్మాణం
   
 • రూ.23.50 కోట్లతో దక్షిణాన అదనపు క్యూ కాంప్లెక్స్, రూ.7.75 కోట్లతో కనకదుర్గా నగర్ ప్రవేశం వద్ద మహారాజ ద్వార నిర్మాణం
   
 • రూ.18.30 కోట్లతో మల్లికార్జున మహా మండపం వద్ద క్యూ కాంప్లెక్స్ మార్పు, రూ.19  కోట్లతో నూతన కేశ ఖండన శాల నిర్మాణం, రూ.10 కోట్లతో ప్రస్తుత గోశాల భవనాన్ని బహుళ సముదాయం మార్పు
   
 • రూ.5 కోట్లతో కొండపైన గ్రానైట్ రాతి యాగశాల నిర్మాణం, రూ.33 కోట్ల దేవస్థానం - ప్రైవేట్ భాగస్వామ్యంతో కనకదుర్గానగర్ వద్ద మల్టీ లెవల్ కారు పార్కింగ్ నిర్మాణం చేపడతారు.

ప్రారంభోత్సవాలివే...

రూ.5.60 లక్షల ప్రభుత్వ నిధులతో చేపట్టిన మల్లేశ్వర స్వామి ఆలయం, రూ.4.25 కోట్లతో ఇంద్రకీలాద్రి కొండ రక్షణ పనులు, రూ.3.25 కోట్లతో చేపట్టిన ఎల్ టీ ప్యానల్ బోర్డులు, ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, స్కాడా పనులు పూర్తి కాగా, వాటిని సీఎం జగన్ ప్రారంభించారు. అలాగే, దేవాదాయ శాఖ నిధులు రూ.3.87 కోట్లతో చేపట్టిన 8 ఆలయాల పునఃనిర్మాణం పనులు పూర్తి కాగా వాటిని కూడా ప్రారంభించనున్నారు.  పాతపాడులోని ఆలయానికి చెందిన స్థలంలో రూ.5.66 కోట్లతో ఓ మెగావాట్ సోలార్ విద్యుత్ కేంద్రం, కొండ దిగువన రూ.23 లక్షలతో నిర్మించిన ఆలయాలను సైతం సీఎం ప్రారంభించనున్నారు.

మరికొద్ది నెలల్లో ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ తెలిపింది. ప్రస్తుత అభివృద్ధి పనులతో దుర్గగుడి వద్ద భక్తుల ట్రాఫిక్ కష్టాలకు, ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.