భారత రాజ్యాంగం ఎంతో గొప్పది: సీఎం జగన్

భారత రాజ్యాంగం ఎంతో గొప్పది: సీఎం జగన్

దేశాన్ని ఒకేతాటిపై న‌డిపించేది రాజ్యాంగమే అని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్  రెడ్డి అన్నారు.  రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలకు రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో  రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో అంబేద్కర్‌ చిత్రపటానికి గవర్నర్‌, సీఎం నివాళులర్పించారు.

80 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన రాజ్యాంగం రూపొందించారని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని.. అందరికీ క్రమశిక్షణ నేర్పే రూల్‌ బుక్‌ రాజ్యాంగం అన్నారు. మన దేశంలో 72 ఏండ్లుగా ఈ రాజ్యాంగం సామాజిక వర్గాల చరిత్రను తిరగరాసిందన్నారు. రాజ్యాంగం అణగారిన వర్గాలకు అండగా నిలిచిందన్నారు. 

గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను అమలు చేస్తున్న తొలి రాష్ట్రం ఏపీ అన్నారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మైనార్టీలకు 50 శాతం ఇస్తున్న ప్రభుత్వం వైఎస్సార్సీపీదే అని పేర్కొన్నారు.. అక్కాచెల్లెమ్మల పేర్లతోనే ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని..అభివృద్ధి, అనేక సంక్షేమ పథకాలతో తారతమ్యాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. మంత్రి మండలిలో 70 శాతం బీసీలు, ఎస్సీలు,ఎస్టీలు, మైనార్టీలే ఉన్నారని.. స్పీకర్‌గా బీసీని, మండలి ఛైర్మన్‌గా ఎస్సీని, మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మైనారిటీ వ్యక్తిని నియమించామని  సీఎం తెలిపారు.