అమరావతి: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుతనం ఎంతుందో తెలియాలంటే కుల గణన అవసరమని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఏపీ అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్ కులాల వారీగా బీసీ జనగణన అంశంపై మంగళవారం ప్రసంగించారు. 1931లో కులపరమైన జనాభా గణన జరిగిందని.. 90 ఏళ్లుగా కులపరమైన జనాభా లెక్కలు లేవన్నారు. దేశంలో బీసీల జనాభా 52 శాతమని పేర్కొన్న జగన్.. వెనబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు అవసరమని స్పష్టం చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కుల గణన జరగలేదని తెలిపారు. కేంద్రానికి అనేక ప్రతిపాదనలు పంపామని గుర్తుచేశారు. కుల గణన డిమాండ్‌కు తాము పూర్తిగా మద్దతు పలుకుతున్నామని చెప్పారు. బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని పేర్కొన్నారు.
