ఏపీ అప్పు రూ.3.62 లక్షల కోట్లు

ఏపీ అప్పు రూ.3.62 లక్షల కోట్లు

అమరావతి, వెలుగు:రాష్ట్రం ఏర్పడ్డాక టీడీపీ పాలనలో ఏపీ ఆర్థిక పరిస్థితి దీనావస్థలోకి వచ్చిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బుధవారం శ్వేత పత్రం విడుదల చేసిన ఆయన 2014 – 19 మధ్య ప్రజానుకూల పాలన జరగలేదని, ఏ రంగంలోనూ రాష్ట్రం అభివృద్ధి చెందలేదన్నారు. విభజన నాటికి రూ. 90 వేల కోట్లుగా ఉన్న అప్పు..ప్రస్తుతం రూ. 3.62 లక్షల కోట్లకు చేరిందన్నారు. రూ. 66 వేల కోట్లతో రెవెన్యూ లోటు ఉందన్నారు. టీడీపీ సర్కారు హయాంలో చెల్లించాల్సిన రూ. 18 వేల కోట్ల బకాయిలను కూడా పెండింగ్లో ఉంచారని, ఉద్యోగులకు జీతాలివ్వకుండా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించారని దుయ్యబట్టారు. ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటి చంద్రబాబు సర్కారు అప్పులు చేసిందని విమర్శించారు. చేసిన అప్పులతో భవిష్యత్తు ఆదాయం వచ్చే ప్రాజెక్టులనూ కట్టలేదన్నారు. సొంత అవసరాల కోసం పథకాలు, వాటి నిర్వహణ కోసం అప్పులు చేశారని బుగ్గన మండిపడ్డారు.

ఏ శాఖలో చూసినా పెండింగ్ బిల్లులే…

చంద్రబాబు సర్కారు గత మూడేళ్లలో ఓడీలతో పరిపాలన సాగించారని విమర్శించారు. రూ. 18 వేల కోట్ల బిల్లులను పెండింగులో ఉంచి కాంట్రాక్టులకు మాత్రం బిల్లులు చెల్లించారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం రూ. 2.58 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. కార్పొరేషన్ల పేరుతో రూ. 58 వేల కోట్లు రుణం తీసుకుందని, పౌరసరఫరా శాఖ పేరిట రూ. 18,375 కోట్ల అప్పు తీసుకుందని చెప్పారు. వివిధ శాఖల్లో రూ. 10,075 కోట్ల మొత్తాన్ని దారి మళ్లించి ఆ శాఖ పీడీ ఖాతాలను ఖాళీ చేశారన్నారు.

బాబువి దొంగ లెక్కలు

2014 –15 నుంచి 2017–18 వరకు (మైనస్) -0.35, -12.28, -7.36, -15.31శాతంగా ఏపీలో బుణాత్మక వ్యవసాయ వృద్ధిరేటు నమోదైతే చంద్రబాబు అభివృద్ధి చెందుతున్నట్లుగా దొంగ లెక్కలు చూపారని మంత్రి ఫైర్ అయ్యారు. 2004 నుంచి 2009 వరకు 12 శాతం గ్రోత్ రేటు ఉన్న ఏపీ 2014 నుంచి 2019 మధ్య కాలంలో దారుణమైన పరిస్థితి ఎదుర్కొందన్నారు. తెలంగాణలో ఒక్కొక్కరిపై పన్ను ఆదాయం రూ. 14,411 గా ఉంటే ఏపీలో రూ. 8.397 మాత్రమే ఉందని గుర్తుచేశారు. ఆదాయాన్నిచ్చే హైదరాబాద్ ను కోల్పోయామని, ప్రత్యేక హోదా అడిగితే చంద్రబాబు స్వప్రయోజనాల కోసం ప్యాజేజీకి పరిమితమై రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారని మండిపడ్డారు.

సర్​ప్లస్ నుంచి సంక్షోభంలోకి

పదేళ్లకు ముందు రెవెన్యూ సర్​ప్లస్ లో ఉన్న ఏపీ ప్రస్తతం రూ. 66 వేల కోట్ల లోటుతో ఆర్థిక సంక్షోభంలో పడిపోయిందన్నారు. 1990 నుంచి 2003 మధ్య కాలంలో రూ. 21 వేల కోట్లు లోటులో ఉన్న ఏపీ 2004 నుంచి రెవెన్యూ సర్​ప్లస్ సాధించి సుభిక్షంగా ఉందన్నారు. విభజన తరువాత 2014 లో రూ. 11 వేల కోట్లుగా ఉన్న రెవెన్యూ లోటు 2019 నాటికి రూ. 66 వేల కోట్లకు చేరిందన్నారు. చంద్రబాబు సర్కారు ఎఫ్ ఆర్బీఎం యాక్టు పరిమితిని మించి గత నాలుగేళ్లలో అప్పులు చేసిందన్నారు. 2014 –15లో 1.11గా ఉన్న అప్పులు లెక్క 2015 –16లో 3.67, 2016 –17లో 4.42, 2017 –18లో 4.08కు చేరిందన్నారు.