
హైదరాబాద్, వెలుగు: టెక్నాలజీ ఆధారిత రియల్ ఎస్టేట్ కేంద్రంగా హైదరాబాద్ ఎదుగుతోందని ప్రణవ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీటీఓ రాంబాబు బూరుగు తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించడమే లక్ష్యంగా ప్రణవ గ్రూప్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ల (ఐపీసీ) సమావేశాన్ని హైదరాబాద్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ నగర అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, గర్వంగా చెప్పుకోదగిన ప్రాజెక్టుల నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఏఐ ఆధారిత మార్కెటింగ్, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబిలిటీ మధ్య సమన్వయం అవసరమన్నారు.
పరిశ్రమ అభివృద్ధికి కన్సల్టెన్సీల మధ్య భాగస్వామ్యం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి మార్గదర్శకంగా నిలిచేలా రియల్ ఎస్టేట్, మార్కెటింగ్ రంగాల్లో కొత్త ప్రమాణాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యానల్ చర్చ జరిగింది. రియల్ ఎస్టేట్ రంగంలో మార్పులు, నియంత్రణ విధానాలు, కన్సల్టెన్సీ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సుస్థిర డిజైన్ ప్రాముఖ్యత, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగర పురోగతికి సంబంధించిన విభిన్న అంశాలు చర్చించారు.