గుట్టుచప్పుడు కాకుండా రైట్​ కెనాల్​ పనులు చేస్తున్న ఏపీ

గుట్టుచప్పుడు కాకుండా రైట్​ కెనాల్​ పనులు చేస్తున్న ఏపీ
  • ఆర్డీఎస్​కు ఏపీ గండి
  • గుట్టుచప్పుడు కాకుండా రైట్​ కెనాల్​ పనులు
  • 4 టీఎంసీల పేరుతో 5 లక్షల ఎకరాలకు నీరు తరలించే కుట్ర
  • సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండానే పనులు

అయిజ, వెలుగు: ఆర్డీఎస్ ​ప్రాజెక్టు వద్ద ఏపీ ప్రభుత్వం చేపట్టిన రైట్​ కెనాల్​ పనులు ఆగడం లేదు. ప్రపంచమంతా కరోనాతో సతమతమవుతుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం గుట్టుచప్పుడు కాకుండా కెనాల్​ పనులు కొనసాగిస్తోంది. ఆర్డీఎస్​వద్ద రైట్ కెనాల్​నిర్మిస్తే తెలంగాణలోని 87,500 ఎకరాల ఆయకట్టుకు ముప్పు వాటిల్లుతుందని, నిర్మాణాన్ని ఆపాలని అలంపూర్​ నియోజకవర్గ రైతులు, రైతుసంఘాలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మొత్తుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. విషయాన్ని మూడు నెలల క్రితం అలంపూర్​ రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సెంట్రల్​వాటర్​కమిషన్​(సీడబ్ల్యూసీ) అనుమతులు లేకుండా ఏపీ చేపట్టిన రైట్ కెనాల్​ పనులను అధికారికంగా అడ్డుకుంటామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్​ చెప్పినా నేటికీ ఆ దిశగా చర్యలు మాత్రం చేపట్టలేదు. 

1,948 కోట్లతో కెనాల్​ పనులు
అలంపూర్​ నియోజకవర్గంలో ఆర్డీఎస్ ​కింద 87,500 ఎకరాల ఆయకట్టు సాగు కావాల్సి ఉండగా ఏపీ, కర్నాటక జలదోపిడీ కారణంగా 30 ఏండ్లుగా 20 వేల ఎకరాలకు మించి సాగు కావడం లేదు. ఏపీ రైట్​ కెనాల్​ నిర్మిస్తే 20 వేల ఎకరాల సాగు కూడా కష్టమవుతుంది. ఏపీ ప్రభుత్వం మంత్రాలయం నియోజకవర్గంలోని అలగనూరు గ్రామ సమీపంలోని ఆర్డీఎస్​వద్ద 1,948 కోట్లతో రైట్​కెనాల్​పనులు ప్రారంభించింది. మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 160 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్​ నిర్మించడంతోపాటు 4 రిజర్వాయర్లు నిర్మించనుంది. బ్రిజేష్​ కుమార్​ ట్రిబ్యునల్ ​ప్రకారం తమకు 4 టీఎంసీల నీటి వాడకానికి అనుమతులు ఉన్నాయని ఏపీ వాదిస్తోంది. కానీ మొత్తంగా 5 లక్షల ఎకరాలకు సాగునీటిని తరలించేందుకు కుట్ర పన్నుతోంది. వరద జలాలను మాత్రమే వినియోగించి రిజర్వాయర్లు నింపుతామని సాకులు చెబుతోంది. 

ఎండనున్న లిఫ్టులు
ఏపీ రైట్​కెనాల్​ ద్వారా నీటిని తరలింపు ప్రారంభిస్తే అలంపూర్​ నియోజకవర్గానికి తాగు, సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయి. తుంగభద్రా నదీ పరివాహకంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్మించిన తుమ్మిళ్ల, గార్లపాడు, బుడమొర్సు, మద్దూరు తదితర లిఫ్టులు నీరందక ఎండిపోయే ప్రమాదముంది. దీంతో 87,500 ఎకరాల ఆర్డీఎస్​ఆయకట్టుతో పాటు నదీ పరివాహకంలో ఉన్న మరో 4 లక్షల  ఎకరాలు బీళ్లుగా మారతాయి. అలాగే దాదాపు 50 గ్రామాలకు తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురవుతాయి. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్రంతో చర్చించి రైట్​ కెనాల్ ​పనులు నిలిపివేయాలని నడిగడ్డ రైతులు కోరుతున్నారు. 

రైట్​ కెనాల్​ నిర్మాణం ఆపాలె
ఆర్డీఎస్​వద్ద ఏపీ నిర్మిస్తున్న రైట్​కెనాల్​నిర్మాణ పనులు వెంటనే ఆపాలి. లేక పోతే అలంపూర్​లోని 87,500 ఎకరాల ఆయకట్టు బీడుగా మారే ప్రమాద ముంది. రైట్​ కెనాల్​ నిర్మాణంపై సీఎం కేసీఆర్​3 నెలల కిందట అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ నెరవేరలేదు. 30 ఏండ్లుగా నీటి వివక్షకు గురవుతున్న నడిగడ్డ రైతులకు స్వరాష్ర్టంలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గద్దెనెక్కిన సీఎం నీళ్లన్నీ ఏపీ దోచుకుంటుంటే చూసీచూడనట్టు వ్యవహరించడం సరైంది. కాదు. ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్​ ఉత్తర తెలంగాణపై చూపుతున్న శ్రద్ధ దక్షిణ తెలంగాణపై చూపకపోవడం అత్యంత దారుణం. 
-  రామచంద్రారెడ్డి, బీజేపీ గద్వాల డిస్ట్రిక్ట్​ ప్రెసిడెంట్