హైదరాబాద్ తాగునీటిపై ఏపీ కిరికిరి

హైదరాబాద్ తాగునీటిపై ఏపీ కిరికిరి

బచావత్ అవార్డులో కేటాయింపులే లేవంటూ వాదన
హైదరాబాద్ తాగునీటి విషయంలో ఏడో క్లాజ్ వర్తించదంటూ కామెంట్స్
తెలంగాణకు మినహాయింపు ఇస్తే తమకూ ఇవ్వాలని పట్టు
సీడబ్ల్యూసీకి చేరిన పంచాయితీ
పరిష్కరించాలంటూ కేఆర్ఎంబీ చైర్మన్ లెటర్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ తాగునీటిపై ఏపీ ప్రభుత్వం పేచీ పెడుతోంది. డొమెస్టిక్ వాటర్ యూసేజీలో 20 శాతమే లెక్కించాలన్న బచావత్ అవార్డులోని ఏడో క్లాజ్.. హైదరాబాద్ తాగునీటి విషయంలో వర్తించదని వాదిస్తోంది. అసలు బచావత్ అవార్డులో తాగునీటికి కేటాయింపులే లేవని అడ్డగోలు వాదనను తెరపైకి తెచ్చింది. ఒకవేళ తెలంగాణకు తాగునీటి లెక్కల్లో మినహాయింపులు ఇస్తే తమ రాష్ట్రానికి కూడా వాటిని వర్తింపజేయాలని కోరుతోంది. తెలంగాణ ప్రభుత్వం డొమెస్టిక్ యూసేజీలో 20 శాతమే లెక్కించాలని కోరుతుండటం, ఏపీ అందుకు విరుద్ధంగా లెటర్ రాయడంతో ఈ పంచాయితీ సీడబ్ల్యూసీకి చేరింది. ఈ అంశాన్ని పరిశీలించి పరిష్కరించాలంటూ కేఆర్ఎంబీ చైర్మన్ పరమేశం సోమవారం సీడబ్ల్యూసీ చైర్మన్ కు లెటర్ రాశారు.

ఏడో క్లాజ్ ప్రకారం..
ఏదైనా నది, ఉప నది వాటి పరిధిలోని కాలువల ద్వారా మళ్లించే, లిఫ్ట్ చేసే నీటిని తాగునీటి అవసరాల కోసం ఉపయోగిస్తే… మళ్లించే మొత్తం నీటిలో 20 శాతమే ఆ రాష్ట్ర వినియోగంలో లెక్కించాలని బచావత్ అవార్డులోని ఏడో క్లాజ్ చెబుతోంది. హైదరాబాద్ తాగునీటి కోసం తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ నుంచి 16.50 టీఎంసీలను మళ్లిస్తోంది. అందులో 20 శాతమే నీటిని వినియోగంగా గుర్తించాలని ఇప్పటికే పలు సందర్భాల్లో కేఆర్ఎంబీని కోరింది. బోర్డు మీటింగుల్లోనూ దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈనెల నాలుగో తేదీన నిర్వహించిన బోర్డు 12 మీటింగ్ లోనూ చర్చించారు. తెలంగాణ కోరుతున్న మినహాయింపులపై ఏపీ ప్రభుత్వ వైఖరి చెప్పాలంటూ కేఆర్ఎంబీ ఈ మధ్య లెటర్ రాసింది.

తాగునీటికి కేటాయింపులే లేవు
కేఆర్ఎంబీ లెటర్కు బదులుగా ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ కూడా లెటర్ రాశారు. బచావత్ అవార్డులో ఎక్కడా తాగునీటికి కేటాయింపులు చేయలేదని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీల్లోంచే హైదరాబాద్ తాగునీటి కోసం నాగార్జున సాగర్ నుంచి 16.50 టీఎంసీలు మళ్లిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి ఏపీలో హెచ్ఎండబ్ల్యూఎస్ కు 3.30 టీఎంసీలు కేటాయిస్తూ జీవో జారీ చేశారని, కానీ తెలంగాణ ప్రభుత్వం 16.50 టీఎంసీలను మళ్లిస్తోందని చెప్పారు.

ఏడో క్లాజ్ వర్తించదు
‘‘డొమెస్టిక్ యూసేజీకి చేసే నీళ్లలో 20 శాతమే యుటిలైజేషన్ కింద లెక్కించాలనే బచావత్ ఏడో క్లాజ్ తెలంగాణ విషయంలో వర్తించదు. తాగునీరు, ఇతర దేశీయ అవసరాల కోసం మళ్లించే నీటిలో 20 శాతాన్నే ఉపయోగించుకుంటారని, మిగతా 80 శాతం రీ జనరేటెడ్ వాటర్ కాలువల ద్వారా మళ్లీ నదిలోకే చేరుతుందనేది బచావత్ ఏడో క్లాజ్ అంతరార్థం కాదు. హైదరాబాద్ కు మళ్లించే నీళ్లు మూసీలోకి చేరుతున్నాయి. నల్గొండ జిల్లాలోని మూసీ రిజర్వాయర్ ద్వారా తెలంగాణ ప్రభుత్వమే ఆ నీటిని తిరిగి  ఉపయోగించుకుంటున్నది. అలాంటప్పుడు ఏడో క్లాజ్ కింద మినహాయింపు కోరడంసరికాదు” అని లెటర్లో ఏపీ ఈఎన్సీ పేర్కొన్నారు. తాగునీటి కోసమంటూ మళ్లించే నీటిని లెక్కించేందుకు సరైన మెకానిజం కూడా లేదన్నారు. రిటర్న్ ఇన్ ఫ్లో లెక్కించడానికి వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. మిషన్ భగీరథ ద్వారా మళ్లించే నీటిని ఏడో క్లాజ్ కింద పరిగణించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోందని, అలాంటి మినహాయింపులు ఇవ్వడం తమకు ఆమోదయోగ్యం కాదని
స్పష్టం చేశారు.

మాకూ ఇవ్వండి
తెలంగాణకు తాగునీటి వినియోగంలో మినహాయింపులు ఇస్తే తమ రాష్ట్రానికి ఏడో క్లాజ్ ను వర్తింపజేయాలని ఏపీ కోరింది. తాము నాగార్జునసాగర్ నుండి, ఎడమ కాలువలు, కృష్ణాడెల్టా సిస్టం ద్వారా ఏపీ తాగునీటి అవసరాల కోసం నీటిని తీసుకుంటున్నామని, ఆ నీటి వినియోగాన్ని 20 శాతంగానే లెక్కించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో ఈ విషయాన్ని పరిశీలించి పరిష్కారానికి సరైన విధానం చూపించాలంటూ సీడబ్ల్యూసీని కేఆర్ఎంబీ కోరింది.

For More News..

తీర్పు వచ్చిన గంటకే తాళం

లాక్డౌన్ భయంతో హైదరాబాద్‌ వదిలేసి ఊర్లకు పోతున్నజనం