ఔను.. సంగమేశ్వరం కోసం కాల్వ తవ్వినం

V6 Velugu Posted on Aug 09, 2021

  • ఒప్పుకున్న ఏపీ సర్కార్​.. ఎన్జీటీలో అఫిడవిట్
  • శ్రీశైలం నిండితే పనులు చేయలేమని ముందే తవ్వినం
  • కాంక్రీట్‌ పనులు చేస్తలేం.. ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘిస్తలేం
  • పనుల పరిశీలనకు నిజనిర్ధారణ కమిటీ అవసరం లేదని వాదన
  • కేసు విచారణ 3 వారాలకు వాయిదా వేయాలన్న కృష్ణా బోర్డు

హైదరాబాద్‌, వెలుగు: సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌ స్కీం ప్రాజెక్టు కోసం శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునేందుకు కాల్వ తవ్వామని ఏపీ సర్కార్​ ఒప్పుకుంది. భారీ వర్షాలు కురిసి శ్రీశైలం ప్రాజెక్టు నిండితే కాల్వ తవ్వడం సాధ్యం కాదు కాబట్టి ముందే తవ్వేశామని పేర్కొంది. ఇన్నాళ్లూ ఇన్వెస్టిగేషన్‌ పనులు మాత్రమే చేస్తున్నామని బుకాయిస్తూ వస్తున్న ఏపీ.. కాల్వ తవ్విన విషయాన్ని  మొదటిసారిగా అంగీకరించింది. పంపుహౌస్‌ కోసం ఎలాంటి కాంక్రీట్‌ పనులు చేయడం లేదని తెలిపింది. నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్​ ఆదేశాల మేరకు సంగమేశ్వరం ప్రాజెక్టు కోసం సర్వే పనులు తప్ప నిర్మాణ పనులేమీ చేయడం లేదని పేర్కొంది. ఈ మేరకు ఏపీ సీఎస్‌‌ ఆదిత్యనాథ్‌‌ దాస్‌‌ ఎన్జీటీ  చెన్నై బెంచ్‌‌లో అఫిడవిట్‌‌ ఫైల్‌‌ చేశారు. 

ఎండాకాలంలోనే పూర్తి
సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మొదట ముచ్చుమర్రి నుంచి చేపట్టాలని నిర్ణయించారు. అప్రోచ్‌‌ చానల్‌‌, పంపుహౌస్‌‌, కాల్వల కోసం 500 ఎకరాల ప్రైవేట్‌‌ భూములు సేకరించాల్సి వస్తుండటంతో దానిని పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌కు ఉత్తరం వైపు మార్చారు. ఈ పంపుహౌస్‌‌కు నీళ్లు తెచ్చేందుకు శ్రీశైలం రిజర్వాయర్‌‌ లోపల 8.89 కి.మీ.ల పొడవైన అప్రోచ్‌‌ చానల్‌‌ తవ్వాల్సి ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో మునిగిన భవనాసి వాగును కలుపుకొని దాదాపు 8 కిలో మీటర్ల పొడవున ఈ కాల్వ తవ్వారు. మొన్న ఎండాకాలంలోనే తవ్వకం పూర్తి చేశారు. కాల్వ నీటిని ఫోర్‌‌ బే ద్వారా శ్రీశైలం కట్ట బయట నిర్మించే సర్జ్‌‌పూల్‌‌కు చేరవేస్తారు. దాని నుంచి డ్రాఫ్ట్‌‌ ట్యూబుల ద్వారా పంపుహౌస్‌‌లోకి తరలించి అక్కడి నుంచి ఎత్తిపోస్తారు. లిఫ్ట్‌‌ చేసే నీటిని 500 మీటర్ల అప్రోచ్‌‌ చానల్‌‌ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ దిగువన 0.3 కి.మీ.ల వద్ద శ్రీశైలం రైట్‌‌ మెయిన్‌‌  కెనాల్‌‌లో కలుపుతారు. దీనికి 25.20 హెక్టార్ల భూమి  అవసరమని, అది ప్రభుత్వ భూమేనని అఫిడవిట్‌‌లో ఏపీ సర్కారు పేర్కొంది. ప్రాజెక్టు కోసం జియాలజికల్‌‌ సర్వే ఆఫ్‌‌ ఇండియాతో పాటు సెంట్రల్‌‌ డిజైన్స్‌‌ ఆర్గనైజేషన్‌‌ ఆధ్వర్యంలో సర్వే చేయించి వర్క్‌‌ సైట్‌‌ మార్చామని తెలిపింది. శ్రీశైలంలో కాల్వ తవ్వే ప్రాంతం సున్నాపురాయితో కూడిన భూమి ఉండటంతో తవ్వకం పనులు ఆలస్యమవుతాయని, వర్షాలు రాకముందే ఆ పనులు పూర్తి చేశామంది. పంపుహౌస్‌‌ నిర్మించే ప్రాంతంలో ఫౌండేషన్‌‌ కోసం సర్వే పనులు చేశామని పేర్కొంది. అక్కడ ఎలాంటి కాంక్రీట్‌‌ పనులు చేయలేదని, ఎన్జీటీ తీర్పును తాము ఎక్కడా ఉల్లంఘించలేదని ఏపీ తెలిపింది. కాల్వ తవ్వకం పనులు కూడా ఈ ఏడాది జులై 7న నిలిపి వేశామంది.  ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘించి పనులు చేస్తున్నామనే ఆరోపణలు సరికాదంది. ఈ పనులు పరిశీలించేందుకు అసలు నిజానిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఏపీ పేర్కొంది.

విచారణ 3 వారాలకు వాయిదా వేయండి: కేఆర్‌‌ఎంబీ
సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌ స్కీం ప్రాజెక్టును విజిట్‌‌ చేసి నివేదిక ఇవ్వడం కోసం విచారణను మూడు వారాలకు వాయిదా వేయాలని ఎన్జీటీని కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు(కేఆర్​ఎంబీ) కోరింది. ఈ మేరకు బోర్డు మెంబర్‌‌ సెక్రటరీ డీఎం రాయ్‌‌పురే ఆదివారం ఎన్జీటీ చెన్నై బెంచ్​కు లెటర్​ రాశారు. ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ తీర్పును అతిక్రమించి సంగమేశ్వరం పనులు చేస్తోందని రైతు గవినోళ్ల శ్రీనివాస్​ వేసిన పిటిషన్​ను  బెంచ్​ సోమవారం విచారించాల్సి ఉంది. ఈ విచారణలోనే ప్రాజెక్టు విజిటింగ్​ రిపోర్టును కేఆర్​ఎంబీ ఇవ్వాల్సి ఉంది. అయితే.. ఈ నెల 5న ప్రాజెక్టును సందర్శించాల్సి ఉండగా, తనిఖీ బృందంలో సభ్యుడిగా ఉన్న కేజీబీవో డైరెక్టర్‌‌ పి. దేవేందర్‌‌రావుపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసిందని, తెలంగాణ స్థానికత కలిగిన ఆయనను టీం నుంచి తప్పించాలని కోరిందని కృష్ణా బోర్డు పేర్కొంది. రెండు రాష్ట్రాలకు సంబంధం లేని నిపుణులతో ప్రాజెక్టు విజిట్‌‌ చేయాల్సి ఉందని, దేవేందర్‌‌రావు స్థానంలో చీఫ్‌‌ ఇంజనీర్‌‌ స్థాయి అధికారిని ప్రాజెక్టు తనిఖీ బృందంలో నియమించాలని కేంద్ర జలశక్తి శాఖకు  లెటర్​ రాశామని తెలిపింది. దేవేందర్​రావు స్థానంలో మరో సభ్యుడిని నియమించాల్సి ఉన్నందున ప్రాజెక్టును తనిఖీ చేయలేకపోయామని వివరించింది. కేసు విచారణను 3 వారాలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది.

Tagged KRMB, andhrapradesh, NGT, sangameshwaram, srisailam

Latest Videos

Subscribe Now

More News