పాపికొండల టూర్ పై ఏపీ సర్కార్ ఆంక్షలు.. విహార లాంచీలు తాత్కాలికంగా నిలిపివేత

పాపికొండల టూర్ పై ఏపీ సర్కార్ ఆంక్షలు.. విహార లాంచీలు తాత్కాలికంగా నిలిపివేత

భద్రాచలం, వెలుగు: పాపికొండల టూరిజంపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాజమండ్రి నుంచి వచ్చే పాపికొండల విహార లాంచీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నీటిపారుదల శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో టూరిస్టుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది.

2019 సెప్టెంబర్​ 15న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామం వద్ద వశిష్ఠపున్నమి లాంచీ గోదావరిలో మునిగి 51 మంది టూరిస్టులు చనిపోయిన సంగతి విదితమే. కాగా, పోలవరం జిల్లా వీఆర్​పురం మండలం పోచవరం నుంచి వెళ్లే లాంచీలను నిలిపివేయడంపై ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారు.

బుధవారం పోచవరం నుంచి మూడు లాంచీల ద్వారా 150 మంది టూరిస్టులు పాపికొండల విహారయాత్రకు వెళ్లి వచ్చారు. ప్రతికూల వాతావరణం ఏర్పడితే లాంచీలను నిలిపివేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు.