సిరివెన్నెల కుటుంబానికి అండగా ఏపీ, తెలంగాణ సర్కార్లు

సిరివెన్నెల కుటుంబానికి అండగా ఏపీ, తెలంగాణ సర్కార్లు

అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో చేరి కన్నుమూసిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి హాస్పిటల్ ఖర్చులను ఏపీ సర్కార్ చెల్లించింది. దాంతో సిరివెన్నెల కుటుంబసభ్యులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి  కృతజ్ఞతలు తెలిపారు. 

‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డికి సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞతాభివందనాలు మనస్పూర్తిగా తెలియజేస్తోంది. తేదీ 30/11/2021 మంగళవారం ఉదయం 10 గంటలకు కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న మాకు సీఎం కార్యాలయం నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. సిరివెన్నెల ఆసుపత్రి ఖర్చులన్ని భరించమని సీఎం జగన్‌ ఆదేశించినట్లుగా తెలియజేశారు. కాగా.. అదేరోజు సాయంత్రం 4.07 గంటలకు సిరివెన్నెల స్వర్గస్తులైనారు. ఆయన మృతికి సీఎం జగన్ తమ సంతాపాన్ని తెలియజేశారు. అంతేకాకుండా సిరివెన్నెల అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరఫున సమాచార శాఖ మంత్రి పేర్ని నాని హాజరయ్యారు. సిరివెన్నెల ఆసుపత్రి ఖర్చులన్నీ భరిస్తూ.. మేం కట్టిన అడ్వాన్స్‌ని కూడా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయని మాకు తెలియజేశారు. సిరివెన్నెల పట్ల ఇంత ప్రేమానురాగాలు చూపించి, మా కుటుంబానికి అండగా నిలిచిన ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి మా కుటుంబమంతా కృతజ్ఞతలు తెలియజేస్తోంది’ అని సిరివెన్నెల కుమారుడు సాయి యోగేశ్వర్ తెలిపారు.

అదేవిధంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం కృతజ్ఞతాభివందనాలు తెలియజేసింది. ‘బుధవారం ఉదయం 1-12-2021న తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్.. సిరివెన్నెల పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున  వారు అందించే సాయం గురించి ప్రస్తావించారు. మా కుటుంబానికి అండగా ఉంటామని ఆయన చెప్పిన ధైర్యానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’ అని సిరివెన్నెల కుటుంబ సభ్యులు తెలిపారు.