
న్యూఢిల్లీ, వెలుగు: పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ (పీబీఎల్పీ) కోసం పర్యావరణ ప్రభావ అంచనా(ఈఐఏ) అధ్యయనాన్ని చేపట్టడానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) మంజూరు చేయాలని జూన్ 5వ తేదిన ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రతిపాదనలపై నది లోయ, జల విద్యుత్ ప్రాజెక్టుల నిపుణుల అంచనా కమిటీ(ఈఏసీ) జూన్ 17వ తేదిన జరిగిన సమావేశంలో అంచనా వేసిందని తెలిపింది. ఈ మేరకు గురువారం రాజ్యసభలో అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఈఏసీ మీటింగ్ లో ఏపీ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసినట్టు తెలిపారు.
ఈఐఏ నిర్వహించడానికి కావాల్సిన టీఓఆర్ రూపొందించడానికి ప్రతిపాదనలు సమర్పించే ముందు అంతరాష్ట్ర సమస్యల పరిశీలన, అవసరమైన క్లియరెన్స్/నో అబ్జక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) మంజూరు చేయడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ను సంప్రదించాలని స్పష్టం చేసినట్టు వివరించారు. పైన చెప్పిన విధంగా ఈఏసీ ప్రతిపాదనలు పంపాలని ఏపీ ప్రభుత్వానికి ప్రపోజల్స్ ను తిప్పి పంపినట్లు కేంద్ర మంత్రి సమాధానంలో పొందుపరిచారు.