- బాల సాయిబాబా ట్రస్ట్ భూముల నిర్వహణ ఏపీ పరిధిలోనే
- భూపతి ఎస్టేట్స్‌కు క్రమబద్ధీకరణ చెల్లదు
- హైకోర్టులో ఏపీ ప్రభుత్వం కౌంటర్
హైదరాబాద్, వెలుగు: కర్నూలు జిల్లాలోని బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్‌కు కొండాపూర్‌లోని సుమారు రూ.4 వేల కోట్లకుపైగా విలువైన 42.03 ఎకరాల భూములపై తెలంగాణాకు ఎలాంటి అధికారం లేదని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. ఏపీ ప్రభుత్వ పరిధిలో ఉన్న బాలసాయిబాబా ట్రస్ట్‌కు చెందిన భూముల నిర్వహణ ఏపీ పరిధిలోనే ఉంటుందని పేర్కొంది.
తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బాలసాయిబాబా ట్రస్ట్‌కు చెందిన భూములను ప్రైవేటు సంస్థ అయిన భూపతి ఎస్టేట్స్‌కు ప్రభుత్వం అప్పగించిందని, ఇలా అప్పగించే అధికారం తెలంగాణకు లేదని వాదించింది. కర్నూలులోని బాలసాయిబాబా ట్రస్ట్‌కు చెందిన 42.03 ఎకరాలను భూపతి ఎస్టేట్స్‌కు అప్పగించడాన్ని సవాలు చేస్తూ 2024లో తమ్మనబోయిన సంతోష్ కుమార్ మరో నలుగురు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
దీనిపై విచారించిన చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ ఆదేశాల మేరకు ఏపీ దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ కౌంటరు దాఖలు చేశారు. కర్నూలులో బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ రిజిస్టర్ అయిందని తెలిపారు. ఇతరుల స్వాధీనంలో ఉన్న యూఎల్‌సీ మిగులు భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ జీఓ 455 జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా కొండాపూర్‌లోని సర్వే నంబరు105 నుంచి 108లో ఉన్న 42 ఎకరాల భూమిని క్రమబద్ధీకరిస్తూ 2005లో జీఓ 2065 జారీ చేసిందన్నారు.
మేనేజింగ్ ట్రస్టీ లేఖ ప్రకారం ట్రస్ట్ భూముల రికార్డులు దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చాయన్నారు. బాలాసాయిబాబా మరణానంతరం ట్రస్ట్‌కు కర్నూలు దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారిని ఈఓగా నియమించిందన్నారు. ట్రస్ట్‌ను స్వాధీనం చేసుకోవడాన్ని, కొండాపూర్ భూములను భూపతి అసోసియేట్స్‌కు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేసి తరువాత ఉపసంహరించుకున్నారని, దీనికి వెనుక ఇతర కారణాలున్నాయన్నారు.
2023లో తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల్లో ట్రస్ట్ పేరుకు బదులు భూపతి ఎస్టేట్స్‌ను చేర్చిందని, అలా చేర్చే అధికారం లేదన్నారు. ట్రస్ట్ తెలంగాణ దేవాదాయ చట్టం కింద రిజిస్టర్ కాలేదని, ఇది ఏపీ చట్టం కింద ఏపీలో రిజిస్టర్ అయినందున ట్రస్ట్ భూముల నిర్వహణ ఏపీ దేవాదాయశాఖదేనన్నారు.
