Rajinikanth: 'కూలీ' టిక్కెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ప్రీమియర్ షోకు అనుమతిస్తూ జీవో జారీ.

Rajinikanth: 'కూలీ' టిక్కెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..   ప్రీమియర్ షోకు అనుమతిస్తూ జీవో జారీ.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కూలీ ' మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభిమానులకు భారీ శుభవార్త చెప్పింది.  మూవీ మేకర్స్,  అభిమానుల కోరిక మేరకు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో ప్రీమియర్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో పాటు  టిక్కెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ  జీవో  జారీ చేసింది.

ఈ జీవో ప్రకారం, సినిమా విడుదలైన తొలి రోజు, అంటే ఆగస్టు 14న ఉదయం 5 గంటలకు ప్రీమియర్ షోను ప్రదర్శించుకోవడానికి థియేటర్లకు అనుమతి లభించింది. ఈ ప్రత్యేక షోకు సాధారణ టిక్కెట్ ధరతో పాటు సింగిల్ స్క్రీన్‌లలో రూ. 75, మల్టీప్లెక్స్‌లలో రూ. 100అదనంగా వసూలు చేయవచ్చని పేర్కొంది. ఈ అదనపు షోతో కలిపి రోజుకు మొత్తం ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది.  

కేవలం తొలిరోజు మాత్రమే కాకుండా, సినిమా విడుదలైన మొదటి పది రోజుల పాటు, అంటే ఆగస్టు 14 నుండి 23 వరకు టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  ఈ నిర్ణయం నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యజమానులకు ఆర్థికంగా కొంత ఊరటనిచ్చింది.  భారీ బడ్జెట్ తో తెరక్కించిన  'కూలీ' చిత్రంపై ఉన్న భారీ అంచనాలను దృష్టిలో ఉంచుకొని మూవీ మేకర్స్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 

తమిళనాడులో ఎర్లీ మార్నింగ్ షోలు లేకపోవడంతో నిరాశలో ఉన్న తమిళ అభిమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక పెద్ద ఊరట కలిగిస్తోంది. ప్రిమియర్ షో ఏపీలో చూసేందుకు రెడీ అయ్యారు. అటు  తెలుగు రాష్ట్రాల్లోనూ 'కూలీ' మేనియా స్పష్టంగా కనిపిస్తోంది. రజనీకాంత్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరక్కిక్కించిన మూవీని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు.  లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రజనీకాంత్ దేవాగా,   సైమన్ గా నాగార్జున, రాజశేఖర్ గా సత్యరాజ్, కలీషాగా ఉపేంద్ర, ప్రీతిగా శ్రుతిహాసన్, దయాళ్ గా సౌబిన్ షాహిర్ నటించారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంత మేరకు అందుకుంటుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో తెలుసుకోవాలంటే ఆగస్టు 14 వరకు వేచి చూడాల్సిందే. .