అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి..ఏపీ బకాయిలు రూ.600 కోట్లు

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి..ఏపీ బకాయిలు రూ.600 కోట్లు
  • 2024 తర్వాత అక్కడ సేవలు నిలిపేశాం
  • ఓపెన్ వర్సిటీని ఏలూరుకు మార్చినట్టు ఏపీ సర్కారు జీవో ఇచ్చింది
  • అక్కడ అంబేద్కర్ వర్సిటీకి బ్రాంచీ లేదు
  • ఈ నెల 7న వర్సిటీ 27వ స్నాతకోత్సవం
  • వైస్ చాన్స్​లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి

 హైదరాబాద్,వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఏపీ ప్రభుత్వం రూ.600 కోట్లు బకాయిపడిందని ఆ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం పదేండ్ల గడువు ముగియడంతో 2024 డిసెంబర్ తర్వాతే ఏపీలో తమ సేవలను పూర్తిగా నిలిపివేశామని తెలిపారు. అయినప్పటికీ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న అంబేద్కర్ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్సిటీని ఏలూరుకు మారుస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడం తనను విస్మయానికి గురిచేసిందని చెప్పారు. 

బుధవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బేగంపేట హరిత ప్లాజాలో అక్టోబర్ 7న జరగనున్న వర్సిటీ స్నాతకోత్సవ వివరాలను చక్రపాణి మీడియాకు వెల్లడించారు. విభజన చట్టంలో ఏడాదిలోపు తెలంగాణ, ఏపీ ఎవరి యూనివర్సిటీ వారు ఏర్పాటు చేసుకోవాలని ఉందని, వాళ్లు ఏర్పాటు చేసుకోకపోవడంతో తాము అప్పట్లోనే సేవలు నిలిపివేశామని చెప్పారు.

ఈ నెల 7న కాన్వొకేషన్.. 

ఈ నెల 7న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ కాన్వొకేషన్ నిర్వహిస్తున్నట్టు ఘంటా చక్రపాణి వెల్లడించారు. ఇది 45వ వార్షికోత్సవం, 27వ స్నాతకోత్సవమని, గవర్నర్, చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. న్యాక్ మాజీ డైరెక్టర్, వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్ స్నాతకోత్సవ ప్రసంగం చేయనుండగా.. చిత్ర నిర్మాత, నటుడు బీ నరసింగరావుకు ఈసారి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్టు ప్రకటించారు. యూజీ, పీజీ, డిప్లొమా కోర్సులకు సంబంధించి మొత్తం 36,145 మంది అభ్యర్థులు పట్టాలు అందుకోనున్నారని పేర్కొన్నారు. వీరిలో 19,800 మంది మహిళలు, 43 మంది ఆర్మీ సిబ్బంది, 11 మంది ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్లు, 27 మంది ఖైదీలు ఉన్నారని వివరించారు. 

అలాగే, 23 మందికి పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీలు, మొత్తం 38 బంగారు పతకాలు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు.  ఈ ఏడాది నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి డిజిటల్ విశ్వవిద్యాలయ హోదా దక్కిందని, దీంతో కేవలం మన రాష్ట్రంలోని విద్యార్థులకే కాకుండా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చదువుకునేలా కోర్సులు అందించనున్నట్టు తెలిపారు. మొదటి విడతగా ఎంబీఏ, ఎంకామ్, బీకామ్, ఎంఏ (తెలుగు) కోర్సులకు అనుమతి వచ్చిందని, అక్టోబర్ 15 నుంచి దరఖాస్తుకు అవకాశం ఉందని, భవిష్యత్తులో బీఏ కోర్సులను కూడా లాంచ్ చేస్తామన్నారు.  

ఏపీలో ఎలాంటి కార్యకలాపాలు లేవు..

2015లో విద్యార్థులు కోర్టుకు వెళ్లగా.. ఆ విద్యార్థుల ఖర్చుని ఆయా రాష్ట్రాలు షేర్ చేసుకోవాలని కోర్టు చెప్పిందని, తెలంగాణకు 42%, ఏపీకి 58% వాటా తేల్చారని ఘంటా చక్రపాణి వెల్లడించారు. కానీ 58 శాతం నిధులను ఏపీ సమకూరుస్తామని చెప్పడంతోనే పదేండ్లు సేవలు అందించామని, కానీ ఏపీ ఇప్పటి వరకూ రూ. 600 కోట్లు చెల్లించలేదన్నారు. ప్రస్తుతం తమ వర్సిటీ ఏపీలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదన్నారు.

 కానీ ఇటీవల తాము ఒక సర్క్యులర్ చూసి షాక్ అయ్యామని.. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న అంబేద్కర్ వర్సిటీని ఏలూరుకు మార్చినట్టు జీవో ఇచ్చారని పేర్కొన్నారు.  తెలంగాణ విద్యార్థులను, స్వయానా మంత్రి సీతక్కను కూడా వాళ్ల అలూమ్నిగా అందులో చూపడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిపారు. వర్సిటీలో 24 మంది రెగ్యులర్, 18 మంది కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారని, అదనంగా 20 మంది స్టాఫ్ ను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు.