సీఈసీ, ఈసీ నియామక చట్టంపై.. సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్

సీఈసీ, ఈసీ నియామక చట్టంపై.. సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్
  • తీర్పు పునఃసమీక్షకు సుప్రీంలో పిటిషన్

న్యూఢిల్లీ: సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంపై ఈనెల 23న వెలువడిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలైంది. 2023 చట్టం చెల్లుబాటుపై  తీర్పును సవాల్​ చేస్తూ జయ ఠాకూర్ ఈ పిటిషన్‌‌‌‌ వేశారు. సీఈసీ, ఈసీల ఎంపిక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని (సీజేఐ)ని మినహాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సెప్టెంబర్ 23న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన డివిజనల్​బెంచ్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. 

తీర్పు వెలువరించిన బెంచ్​లోని జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కుమారుడు సిద్ధార్థ్ శర్మ.. మధ్యప్రదేశ్ హైకోర్టులో ఈసీ స్టాండింగ్ కౌన్సిల్‌‌‌‌గా ఉన్నారనే మీడియా కథనాల నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది. ఎన్నికల సంఘం తరఫున వాదిస్తున్న న్యాయవాది జస్టిస్ శర్మకు కుమారుడు కావడం వల్ల ‘న్యాయం జరగడమే కాకుండా, అది జరిగినట్లు స్పష్టంగా కనిపించాలి’ అనే సూత్రానికి విరుద్ధంగా, కాన్​ఫ్లిక్ట్ ​ఆఫ్ ​ఇంటెరెస్ట్ ఏర్పడిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వరుణ్​ఠాకూర్ పేర్కొన్నారు. 

‘రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా’ కేసు గైడ్​లైన్స్ ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 32, 142 కింద అభ్యర్థన దాఖలు చేశారు. సాధారణంగా రివ్యూ పిటిషన్ వేయాల్సి ఉన్నప్పటికీ, అదే బెంచ్ ముందు విచారణకు వస్తుంది కాబట్టి ప్రయోజనం ఉండదనే కారణంతో నేరుగా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ విభేదాలతో తదుపరి చర్యల కోసం ఈ కేసును ధర్మాసనం సీజేఐకి సిఫార్సు చేసింది.