టీనేజర్ల వాట్సాప్‌పై పేరెంట్స్ కంట్రోల్.. కొత్త పేరెంట్ మేనేజ్డ్ అకౌంట్ ఫీచర్

టీనేజర్ల వాట్సాప్‌పై పేరెంట్స్ కంట్రోల్.. కొత్త పేరెంట్ మేనేజ్డ్ అకౌంట్ ఫీచర్
  • టీనేజర్ల వాట్సాప్​పై పేరెంట్స్ పర్యవేక్షణ..    
  • పేరెంట్ మేనేజ్డ్ అకౌంట్‌‌‌‌లను ప్రవేశపెట్టిన మెటా
  • నియంత్రణ మాత్రమే
  •  చాట్‌‌‌‌లను చూడలేరని వివరణ

న్యూఢిల్లీ: టీనేజ్ పిల్లల వాట్సాప్ అకౌంట్లపై తల్లిదండ్రులకు నియంత్రణ ఉండేలా కొత్తగా ‘పేరెంట్ మేనేజ్డ్ అకౌంట్‌‌‌‌’లను ఆ సంస్థ ప్రవేశపెట్టింది. తమ పిల్లల ప్రొఫైల్ ఫొటో ఎవరికి కనిపించాలి? వారు ఏ గ్రూపులో చేరాలి? వారిని ఎవరు  గ్రూపుల్లో చేర్చవచ్చు? వారికి ఎవరి స్టేటస్‌‌‌‌లు కనిపించాలి? వారి స్టేటస్‌‌‌‌లు ఎవరికి కనిపించాలి? పిల్లలు మెటా ఏఐని ఎంత మేరకు వాడాలి? వంటి అంశాలన్నీ ఈ ఫీచర్ ద్వారా తల్లిదండ్రులు నిర్ణయించే వీలుంది. 

అయితే, ఈ కంట్రోల్స్ తప్పనిసరి కాదని వాట్సాప్ వెల్లడించింది. ఒకసారి తల్లిదండ్రులు, పిల్లలు కలిసి సెట్‌‌‌‌ చేసిన పిన్‌‌‌‌ ద్వారా ఈ సెట్టింగులను లాక్‌‌‌‌ చేయవచ్చు. ఆ తర్వాత సడలింపులు, సెట్టింగ్స్​ మార్పులకు ఆ పిన్‌‌‌‌ ఎంటర్ చేయాల్సిందే. అలాగే, టీనేజర్ల వాట్సాప్ పై తల్లిదండ్రులకు నియంత్రణ మాత్రమే ఉంటుంది. పిల్లల చాటింగ్ ను పేరెంట్స్ తమ ఫోన్లలో చూడడం కానీ, చదవడం కానీ, కాల్స్ వినడం కానీ చేయలేరు. మిగతా అకౌంట్ల మాదిరిగానే ఇందులోనూ ఎండ్‌‌‌‌- టు- ఎండ్‌‌‌‌ ఎన్‌‌‌‌క్రిప్షన్‌‌‌‌ ప్రక్రియ కొనసాగుతుందని వాట్సాప్‌‌‌‌ తెలిపింది.

ఏయే గ్రూపుల్లో చేరారో తెలుసుకోవచ్చు

తమ పిల్లలు కొత్త గ్రూపులో చేరినప్పుడు లేదా గ్రూపు నుంచి బయటకు వచ్చినప్పుడు నోటిఫికేషన్‌‌‌‌ వచ్చేలా కూడా తల్లిదండ్రులు సెట్టింగ్‌‌‌‌ చేసుకోవచ్చు. టీనేజర్‌‌‌‌ సభ్యుడిగా ఉన్న గ్రూపులో సభ్యుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పుడు కూడా సమాచారం అందుతుంది. క్లాస్‌‌‌‌, ట్యూషన్‌‌‌‌ గ్రూపుల్లో తెలియని నంబర్లు పెద్ద సంఖ్యలో చేరే సందర్భాల్లో కూడా అలర్ట్ వస్తుంది. అలాగే, మెటా ఏఐ వాడకంపై 13+ (వయసు) కేటగిరీని లేదంటే మరింత ‘లిమిటెడ్ కంటెంట్’ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. అయితే, వాట్సాప్‌‌‌‌ ‘పేరెంట్‌‌‌‌-మేనేజ్డ్‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌’ను ఆయా దేశాల్లో దశలవారీగా విడుదల చేస్తున్నారు. భారత్‌‌‌‌లో ఈ ఫీచర్‌‌‌‌ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనేది వాట్సాప్ వెల్లడించలేదు.