గోదావరిలో మిగులు నీళ్లన్నీ మావే.!

గోదావరిలో మిగులు నీళ్లన్నీ మావే.!
  • అపెక్స్‌ ఎదుట వాదించేందుకు సిద్ధమైన ఏపీ
  • కేంద్రంపై రాజకీయ విమర్శలకే తెలంగాణ ప్రాధాన్యం
  • కృష్ణా ప్రాజెక్టులకు కేటాయింపులపై పట్టుబట్టాలి
  • అదనంగా ఇంకో 100 టీఎంసీలు డిమాండ్‌ చేయాలి
  • మన రాష్ట్ర ప్రభుత్వానికి రిటైర్డ్‌ ఇంజనీర్ల సూచన
  • నేడు ఉదయం 11 గంటలకు అపెక్స్​ కౌన్సిల్​ భేటీ
  • వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొననున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

హైదరాబాద్‌, వెలుగుగోదావరిలో మిగులు జలాలన్నీ తమకే చెందుతాయని, నికర జలాల్లోనూ తమ వాటానే ఎక్కువని అపెక్స్‌ కమిటీలో వాదించేందుకు ఏపీ రెడీ అయింది.  శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ తీసుకుంటున్నట్టుగానే తాము 800 అడుగుల లెవల్‌ నుంచి నీటిని తోడుకుంటామని చెప్పబోతున్నది. ప్రాజెక్టులన్నీ సర్‌ప్లస్‌ అయి నీళ్లు సముద్రంలోకి పోయే రోజుల్లో ఉపయోగించుకున్న నీటిని వాటాలో లెక్కించొద్దని గట్టిగా పట్టుబట్టనుంది. ఏపీకి హక్కుగా వచ్చే నీళ్లు కాకుండా మొత్తం నీళ్లన్నీ తమకే దక్కుతాయన్నట్టుగా అడ్డగోలు వాదనలకు సిద్ధమవుతుండగా..  మన రాష్ట్ర  ప్రభుత్వం మాత్రం కేంద్రంపై రాజకీయ విమర్శలు చేయడానికే అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీని ఉపయోగించుకోవాలని చూస్తున్నది. కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్‌ రాసిన లెటర్‌ కూడా రాజకీయ కోణంలోనే ఉందని రిటైర్డ్‌ ఇంజనీర్లు పెదవి విరుస్తున్నారు. అపెక్స్‌ వేదికను సద్వినియోగం చేసుకొని కృష్ణా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై పట్టుబట్టాలని వారు సూచిస్తున్నారు.

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌‌ షెకావత్‌‌ అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌‌ ద్వారా రెండో అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌‌ నుంచి సీఎం కేసీఆర్‌‌, జలసౌధ నుంచి కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు, ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్‌‌ అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌‌లో పాల్గొననున్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల జ్యూరిస్‌‌డిక్షన్‌‌, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు, రెండు రాష్ట్రాలకు నీటి వాటాలు తేల్చడం, కేఆర్‌‌ఎంబీ హెడ్‌‌ క్వార్టర్స్‌‌ను హైదరాబాద్‌‌ నుంచి ఏపీకి తరలించడమే ప్రధాన ఎజెండాగా ఈ రెండో అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ మీటింగ్‌‌ నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ఏపీ ఆగస్టులోనే పంపిన ఎజెండాలోని అంశాలను అదనంగా చేర్చారు. ఏపీ ప్రభుత్వం తెలంగాణలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను అడ్డుకోవాలని తన ఎజెండాలో కోరింది. తెలంగాణ తన ఎజెండాలో.. శ్రీశైలం నిర్వహణను తమకు అప్పగించాలని, ఏపీ నిర్మిస్తున్న సంగమేశ్వరం లిఫ్ట్‌‌, పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ విస్తరణ ప్రాజెక్టులను ఆపాలని, కృష్ణా నదీ జలాల్లో న్యాయంగా రావాల్సిన వాటాను కేటాయించాలని కోరింది.

గోదావరిపై అడ్డగోలు వాదనకు సిద్ధమైన ఏపీ

గోదావరిలో నీటి కేటాయింపులను ప్రాజెక్టుల వారీగా కాకుండా బేసిన్‌‌ల వారీగా చేస్తూ జస్టిస్‌‌ బచావత్‌‌ అవార్డు ప్రకటించింది. ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో అప్పటి సీఎం కిరణ్‌‌కుమార్‌‌ రెడ్డి తెలంగాణకు 967.94, ఏపీకి 518.21 టీఎంసీల కేటాయింపులున్నట్టు ప్రజంటేషన్‌‌ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌కు బచావత్‌‌ అవార్డులో కేటాయించిన 1,486.15 టీఎంసీల్లో రెండు ప్రాంతాలకు ఈ మేరకు నీటి కేటాయింపులన్నాయని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మాత్రం నికర జలాల్లో ప్రాజెక్టుల వారీగా వినియోగం లెక్కలను తెరపైకి తెస్తున్నది. 2014 జూన్‌‌ 2 నాటికి ఏపీలో 776 టీఎంసీలు, తెలంగాణలో 650 టీఎంసీల వినియోగం చేసేలా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పట్టుబడుతున్నది. అంతేకాదు గోదావరిలో 75 శాతం డిపెండబులిటీ పోను మిగిలి ఉన్న నీళ్లన్నీ తమ రాష్ట్రానికే చెందుతాయని వాదిస్తున్నది. ఈ లెక్కన బేసిన్‌‌ వారీగా లెక్కిస్తే తెలంగాణకు 1,950 టీఎంసీలను వినియోగించుకునే హక్కు ఉందంటున్న కేసీఆర్‌‌ వాదనకు కౌంటర్‌‌ ఎటాక్‌‌ రెడీ చేసింది.

పంచాయితీతో వచ్చేది లేదు.. వాటా సాధించాలి

నీటి కేటాయింపుల విషయంలో కేంద్రంతో పంచాయితీ పెట్టుకుంటే వచ్చేదేమి లేదని, కృష్ణా ప్రాజెక్టులకు వాటాలు సాధించడంపైనే ఫోకస్‌‌ చేయాలని రిటైర్డ్‌‌ ఇంజనీర్లు మన రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు. కేంద్ర మంత్రి షెకావత్‌‌కు కేసీఆర్‌‌ రాసిన లేఖ వివాదాలకు దారి తీసేలా ఉందని, అది రాష్ట్ర ప్రయోజనాలకు ఏమాత్రం లాభం చేయబోదని చెప్తున్నారు. కల్వకుర్తి, పాలమూరు – రంగారెడ్డి, డిండి, నెట్టెంపాడు లిఫ్ట్‌‌ స్కీంలకు 200 టీఎంసీల వాటా సాధించడంతో పాటు వాటికి అదనంగా ఇంకో 100 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని పట్టుబట్టాలన్నారు. 1956 చట్టంలోని సెక్షన్‌‌ 3 ప్రకారం నీటిని మళ్లీ పంపిణీ చేయాలనే డిమాండ్‌‌ మంచిదేనని, దానిని సాధించుకేందుకైనా అపెక్స్‌‌లో వాదనలు చేయాలని సూచిస్తున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం చెప్తే మంచిదేనని, కానీ దానిపైనే ఫోకస్‌‌  చేస్తే అసలు విషయం పక్కకుపోయే ప్రమాదముందని అంటున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం నీటి వాటాలపై ఫోకస్‌‌ చేస్తూనే ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంపైనా దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. పోలవరం నుంచి కృష్ణా డెల్టా, రాయలసీమకు నీటిని మళ్లించే ప్రాజెక్టుతో పాటు ఉత్తరాంధ్ర గోదావరి జలాలు తరలించే ప్రాజెక్టు సహా ఏపీ చేపడుతున్న అన్ని అక్రమ ప్రాజెక్టులపైనా కేంద్రానికి స్పష్టమైన సమాచారం ఇవ్వాలని అంటున్నారు.

కృష్ణాలోనూ మనల్నే బూచీగా చూపుతూ..

సంగమేశ్వరం లిఫ్ట్‌‌ స్కీంకు అపెక్స్‌‌లో బ్రేకులు పడుతాయని ముందుగానే ఊహించిన ఏపీ ప్రభుత్వం ఇక్కడా తెలంగాణనే బూచీగా చూపిస్తున్నది. కల్వకుర్తి, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులను తెలంగాణ 800 అడుగల లెవెల్‌‌లోనే నిర్మిస్తున్నదని, తామూ అదే లెవెల్‌‌లో రోజుకు 3 టీఎంసీలు మళ్లించేందుకు సంగమేశ్వరం నిర్మిస్తున్నామని చెప్పబోతున్నది. ఇది కొత్త ప్రాజెక్టు కాదని, పాత ప్రాజెక్టుల ఆయకట్టును స్టెబిలైజ్ చేయడానికే చేపడుతున్నామని వివరించనుంది. శ్రీశైలంలో 881 అడుగుల లెవల్‌‌లో నీళ్లుంటేనే పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ నుంచి పూర్తి స్థాయిలో నీళ్లు తీసుకునే అవకాశముందని, తెలంగాణ ఆ స్థాయిలో నీటి మట్టం మెయింటేన్‌‌ కాకుండా అడ్డుకుంటున్నదని, అందుకే కొత్త లిఫ్ట్‌‌ను నిర్మిస్తున్నామని చెప్పడానికి రెడీ అయింది.  ఈ వానాకాలంలో శ్రీశైలం లెఫ్ట్‌‌  బ్యాంక్‌‌ పవర్‌‌ హౌస్‌‌లో కరెంట్‌‌ ఉత్పత్తి ద్వారా సాగర్‌‌కు నీటిని విడుదల చేసిన విషయాన్ని ముందు పెట్టడానికి ప్రయత్నిస్తున్నది.