భారీ వర్షాలు ఏపీని వణికిస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా, ఉత్తరాంధ్రపై వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నిన్నటి వరకు విజయవాడను ముంచిన వరదలు.. ఇప్పుడు తూర్పు గోదావరి, శ్రీకుళం జిల్లాపై ప్రతాపం చూపుతున్నాయి. దీంతో లోతట్ట ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.విజయవాడ నగరంతో పాటు సమీప గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. విజయవాడకు ఎగువున ఉన్న రూరల్ గ్రామాలు ముందు వరద తాకిడికి గురయ్యాయి. వరద సహాయక చర్యలన్నీ విజయవాడ కేంద్రంగా జరుగుతుండంటతో.. గ్రామీణ ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి. తమకు వరద సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ వెలుపల..
వెలగలేరు దిగువున బుడమేరు డైవర్షన్ ఛానల్ కాల్వలకు గండి పడటంతో వరద ప్రవాహం నగరాన్ని ముంచెత్తింది. విజయవాడకు వెలుపల కవులూరు, పైడూరుపాడు, శాంతినగర్ జక్కంపూడి, వేమవరం, వైఎస్సార్ కాలనీ, అంబాపురం, నున్న వంటి ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో విజయవాడ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నా ఇవన్నీ గ్రామ పంచాయతీలుగానే ఉన్నాయి. బుడమేరు వరద సహాయక చర్యలన్నీ విజయవాడలోనే కేంద్రీకృతం కావడంతో గ్రామీణ ప్రాంతాలకు బయట నుంచి సరకులు కూడా అందడం లేదు. కేఎల్‌రావు నగర్, సాయిరాం సెంటర్, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో వరద ఉధృతి ఇంకా ఉంది. మరోవైపు కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
ALSO READ | శ్రీకాకుళం జిల్లాలో కొట్టుకుపోయిన కారు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుడమేరు వరద ఇంకా తగ్గలేదు. దీంతో ప్రధాన రహదారులపై వరద ఉధృతి కొనసాగుతోంది. తాజాగా.. బుడమేరు వరదలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి గల్లంతు అయ్యారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. గన్నవరం నుంచి మచిలీపట్నం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫణికుమార్ (40).. హైదరాబాద్‌లో పని చేస్తున్నారు. వినాయక చవితి పండగకు సొంతూరు వెళ్లారు. అక్కడి నుంచి గన్నవరంలోని బంధువుల ఇంటికెళ్లారు. మళ్లీ తిరిగి మచిలీపట్నం బయలుదేరారు. మార్గమధ్యలో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బుడమేరు వాగు ఉద్ధృతిగా ఉందని హెచ్చరించినా వినకుండా వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్నారు. ఓ చోట నీటిలో మునిగిన అతని కారును పోలీసులు గుర్తించారు. అతని కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి.
మోస్తరు వర్షాలకు అవకాశం..
నెల్లూరు, కర్నూల్, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. తుఫాను సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల వరకు విస్తరించి ఉంది. సెప్టెంబరు 10 నాటికి పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో అల్పపీడనంగా మారుతుంది. ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతుందని అధికారులు భావిస్తున్నారు.