ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధంగా హడావుడిగా జరుగుతున్నాయని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికలను నిలిపివేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల పోలింగ్ కు నాలుగు వారాల ముందు నుండి ఎన్నికల కోడ్ అమలు చేయాల్సి ఉంటుందని, ఈ నిబంధనలను పాటించలేదనే విషయాన్ని హైకోర్టు ప్రశ్నించింది. హడావుడిగా ఎన్నికలు నిర్వహించినా రాజ్యంగానికి విరుద్దంగా జరపడానికి వీలులేదంటూ పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఈనెల 15లోగా అఫిడవిట్ దాఖలు చేయమంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను హైకోర్టు ఆదేశించింది. పోలింగ్ కు కేవలం రెండు రోజుల ముందు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సంచలనం సృష్టించాయి. ఒక వైపు పోలింగ్ కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిన నేపధ్యంలో హైకోర్టు ఎన్నికలకు బ్రేక్ వేయడం కలకలం రేపింది.