కర్నూలు బస్సు ప్రమాదంలో 21 మంది మృతి చెందినట్లు ఏపీ హోంమంత్రి అనిత వెల్లడించారు. ప్రమాదంపై మీడియాతో మాట్లాడిన ఆమె.. బైక్ ను ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. అక్టోబర్ 24న ఉదయం 3.30 సమయంలో ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం వచ్చిందని.. వెంటనే ప్రమాద స్థలానికి అధికార యంత్రాంగం వెళ్లిందన్నారు.
ప్రమాదం సమయంలో బస్సులో 39 మంది పెద్దవాళ్లు, నలుగురుచిన్నవాళ్లు, మరో ఇద్దరు ఉన్నారని చెప్పారు హోంమంత్రి అనిత. మొత్తం 27 మంది ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలిపారు. ప్రమాదంలో బైకర్ అక్కడిక్కడే చనిపోయాడని చెప్పారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంత విధంగా ఉన్నాయని.. వాటిని గుర్తించేందుకు 16 ఫోరెన్సిక్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
ప్రమాదంపై ఎంక్వైరీ జరుగుతోందన్నారు అనిత. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు నాలుగు బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నారని చెప్పారు. ప్రమాదంపై ఎంక్వైరీ కమిటీ వేస్తామని చెప్పారు హోమంత్రి అనిత. మృతి చెందిన ఏపీ ప్రయాణికుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా..గాయపడ్డవారికి రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని తెలిపారు.
