పసుపు బిళ్లతో ఆఫీసులకు వెళ్లండి.. పని చేయని అధికారులపై చర్యలు : ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు

పసుపు బిళ్లతో ఆఫీసులకు వెళ్లండి.. పని చేయని అధికారులపై చర్యలు : ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెం నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన తొలిసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో కార్యకర్తల సమావేళంలో అచ్చెం నాయుడు మాట్లాడుతూ..టీడీపీ కార్యకర్తలు ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు మెడలో పసుపు బిళ్ళ వేసుకుని వెళ్ళండని చెప్పారు.  అధికారులు మీకు కుర్చీ వేసి, టీ ఇచ్చి పని ఏంటి అని అడిగి.. ఆ పనిని చేసి పంపిస్తారని చెప్పారు. 

గత 5 సంవత్సరాలు.. వైసీపీ ప్రభుత్వ పాలన ఎలా జరిగిందో చూశామని... అందరి  ఎన్నో అవమానాలకు, వేధింపులకు గురయ్యామని మంత్రి అన్నారు.  తన జీవితంలో ఎప్పుడూ ఇన్ని అవమానాలు,  బాధలు పడలేదని ఆయన  చెప్పారు. ఒక దశలో పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నించినా.. ఎంతో కష్టపడి పని చేశానని.. నిద్రలేని రాత్రులు గడపానని తెలిపారు. 

ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిందని.. మనందరికీ మంచి రోజులు వచ్చాయని చెప్పారాయన. మీ అందరికీ మాట ఇస్తున్నానని.. ఇకనుంచి ప్రతి కార్యకర్తకు గౌరవం దక్కుతుందని హామీ ఇచ్చారు.  పోలీస్ స్టేషన్ కు వెళ్లినా.. ఎమ్మార్వో ఆఫీస్ కువెళ్లినా.. ఏ ప్రభుత్వ ఆఫీస్ కువెళ్లినా మీ అందరికీ పనులు చేసి పెట్టేలా అధికారులను ఆదేశిస్తానని చెప్పారు. ఎవరైనా అధికారులు మాట వినకపోతే.. ఏం జరుగుతుందో వాళ్లకి తెలుసు అని మంత్రి అచ్చెం నాయుడు హాట్ కామెంట్స్ చేశారు.