ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇకలేరు

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇకలేరు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమించినా ప్రయోజనం లేకపోయింది. ఐసీయూలో చేరిన సమాయానికే ఆయన హార్ట్ బీట్ చాలా బలహీనంగా ఉండడంతో ఆయనను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆస్పత్రికి చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే ఆయన తుది శ్వాస విడిచారు. కాగా, ఇటీవలే ఆయన కొవిడ్ బారిన పడి కోలుకున్నారు. పోస్ట్ కొవిడ్ పరిణామాల కారణంగానే గౌతమ్ రెడ్డికి గుండె పోటు వచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు.

వారం రోజుల పాటు దుబాయ్ లో ఐటీ పరిశ్రమల సదస్సులో పాల్గొని రెండ్రోజుల క్రితమే  హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇవాళ ఉదయం అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి వెళ్లేలోగానే పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. వరుసగా 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన మంత్రి పదవిని కైవసం చేసుకున్నాడు. ఈయన తండ్రి నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు చిరపరిచితులే.

రెండోసారి ఎమ్మెల్యే.. కేబినెట్ లో కీలక బాధ్యతలు

మేకపాటి గౌతమ్ రెడ్డి.. ఏపీలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో 1971 నవంబర్ 2న జన్మించారు. యూకేలోని మాంచెస్టర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ (టెక్స్ టైల్స్) చదివారు. 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పార్టీ నుంచి ఆత్మకూరు నుంచి పోటీ చేసి..30,191 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో  మళ్లీ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయనకు సీఎం జగన్ తన కేబినెట్ లో కీలక శాఖలను అప్పగించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పారు. ఏపీ అభివృద్ధికి  ఐటీ, పరిశ్రమల ఏర్పాటు కోసం గౌతమ్ రెడ్డి తన వంతు కృషి చేశారు. కడప జిల్లా కొప్పర్తి, సొంత నియోజకవర్గం ఆత్మకూరు సహా అనేక ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ హబ్స్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. రెండ్రోజుల క్రితమే దుబాయ్ లో ఐటీ పరిశ్రమల సదస్సుకు వెళ్లి వచ్చిన ఆయన ఇవాళ హఠాన్మరణం చెందడం అందరినీ దిగ్భాంతికి గురి చేసింది. ఆయనకు భార్య శ్రీకీర్తి, కుమార్తె అన్యన్య రెడ్డి, కుమారుడు అర్జున్‌రెడ్డి ఉన్నారు.