గౌతమ్ రెడ్డిని ఆస్పత్రికి తెచ్చేటప్పటికే శ్వాస ఆడడం లేదు

గౌతమ్ రెడ్డిని ఆస్పత్రికి తెచ్చేటప్పటికే శ్వాస ఆడడం లేదు
  • గంటన్నరకు పైగా సీపీఆర్ చేసినా ఫలితం లేదు: వైద్యులు

హైదరాబాద్: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా గుండెపోటుకు గురై తుదిశ్వాస విడవడానికి పోస్టు కోవిడ్ పరిణామాలే కారణమని వైద్యులు అంచనా వేస్తున్నారు. నగరంలోని తన నివాసంలో ఇవాళ ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో సిద్ధంగా ఉన్న వైద్యులు గంటన్నరకు పైగా సీపీఆర్ చేసినా ఆయన ప్రాణాలు నిలబెట్టలేకపోయారు. ఆస్పత్రికి తీసుకొచ్చేటప్పటికే ఆయన శ్వాస చాలా బలహీనంగా ఉందని.. వెంటనే సీపీఆర్ స్టార్ట్ చేశామన్నారు.

వారం రోజులపాటు దుబాయ్ ఎక్స్ పోలో పాల్గొని ఏపీకీ పెట్టుబడులు ఆకర్షించడానికి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో ఆయన చర్చలు జరిపారు. సుమారు 5 వేల కోట్లకుపైగా పెట్టుబడులతో ఎంఓయూలు కుదుర్చుకుని స్వదేశానికి తిరిగొచ్చారు. హైదరాబాద్ వచ్చిన ఆయన రేపు మంగళవారం సీఎం జగన్ ను కలసి దుబాయ్ ఎక్స్ పో వివరాలు తెలియజేసేందుకు అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నారు. అయితే ఇవాళ ఉదయమే తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎంత శ్రమించినా ఫలితం లేకపోయింది. కోవిడ్ థర్డ్ వేవ్ సందర్భంగా ఆయన కరోనా సోకడంతో కొద్ది రోజులు చికిత్స తీసుకున్నారు. ఈ పోస్టు కోవిడ్ పరిణామాలతోనే ఆయన గుండెపోటుకు గురై కుప్పకూలిపోయి ఉంటారని వైద్యులు చెబుతున్నారు. రాజకీయంగా ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి చిన్న వయసులోనే కన్నుమూయడం సర్వత్రా దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.