
ఏపీలోని తూగో జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపింది. జిల్లాలోని నల్లజర్ల మండలం ఘంటవారిగూడెంలో ఉన్న ఓ గెస్ట్ హౌస్ పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. బుధవారం ( ఆగస్టు 20 ) నిర్వహించిన ఈ దాడిలో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... ఘంటవారిగూడెంలో ఉన్న ఓ గెస్ట్ హౌస్ లో బర్త్ డే సందర్భంగా మందు, యువతులతో అశ్లీల నృత్యాలతో పార్టీ ప్లాన్ చేశాడు ఓ ఘనుడు. అశ్లీల నృత్యాలపై సమాచారం అందుకున్న కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ గెస్ట్ హౌస్ పై దాడికి ఆదేశాలిచ్చారు.
డీఎస్పీ ఆదేశాలతో నల్లజర్ల సీఐ బాలశౌరి, దేవరపల్లి సీఐ నాయక్ తమ సిబ్బందితో కలిసి గెస్ట్ హౌస్ పై దాడి చేసి.. 25 మంది పురుషులు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి ఏడు కార్లు, రూ. పది వేలు నగదు, మూడు విస్కీ బాటిల్స్, 20 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఇదే గెస్ట్ హౌస్ పై గతంలో కూడా కేసులు నమోదయ్యాయని.. త్వరలోనే గెస్ట్ హౌస్ ను సీజ్ చేస్తామని తెలిపారు పోలీసులు.
ALSO READ : నిరసనల మధ్య..లోక్ సభలో పీఎం, సీఎం తొలగింపు బిల్లు..
ఈ రేవ్ పార్టీ ఎవరు నిర్వహించారు, దీని వెనక సూత్రధారి ఎవరు..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వెస్ట్రన్ మోజులో పడి యువత పెడదారి పట్టి ఇలాంటి పనులకు పాల్పడితే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. పచ్చదనంతో ఎప్పుడూ పాడిపంటలతో ఉండే తమ ప్రాంతానికి కూడా రేవ్ పార్టీ లాంటి విష సంస్కతి పాకడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు స్థానికులు.