అక్రమంగా 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకే ఏపీ ప్రాజెక్టులు

అక్రమంగా 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకే ఏపీ ప్రాజెక్టులు

వాటి వల్ల మూడు వన్యప్రాణి విభాగాలకు నష్టం

ఏపీ ప్రాజెక్టు రిపోర్టులాగే కేంద్రం ఇచ్చిన రిప్లై ఉంది

జడ్జీలు అనుమతిస్తే హెలికాప్టర్ లో తీసుకెళ్లి చూపిస్తాం

సంగమేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో తెలంగాణ అభ్యంతరాలు

హైదరాబాద్, వెలుగు: పెన్నా బేసిన్ లో పది లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకే ఏపీ కొత్త ప్రాజెక్టులు చేపడుతోందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఎదుట తెలంగాణ వాదించింది. కేవలం 1,500 క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లడానికే అనుమతి ఉన్నా.. అక్రమంగా 44 వేల క్యూసెక్కులు తరలిస్తూ 13 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తోందని ఆరోపించింది. ఇప్పుడు అదనంగా మరో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకే సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ ప్రాజెక్టులు చేపట్టిందని వివరించింది. సంగమేశ్వరం లిఫ్ట్ స్కీం పై నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ ను ఎన్జీటీ (చెన్నై) బెంచ్ జ్యుడీషియల్ మెంబర్ జస్టిస్ రామకృష్ణన్, ఎక్స్ పర్ట్ మెంబర్ సైబల్ దాస్ గుప్తా శుక్రవారం వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) రామచందర్ రావు వాదనలు వినిపించారు.

ఇద్దరు సభ్యులు అభ్యంతరం చెప్పారు

సంగమేశ్వరం ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఫైల్ చేసిన రిప్లై.. ఏపీ ప్రాజెక్టు రిపోర్టు చదివినట్టుగానే ఉందని ఏఏజీ ఎగతాళి చేశారు. జాయింట్ కమిటీలో నలుగురు సభ్యులుంటే ఇద్దరు సభ్యులు పర్యావరణ అనుమతులు అవసరమని చెప్పారని, మరో మెంబర్ మౌనంగా ఉన్నారని తెలిపారు. ఒకే సభ్యుడి అభిప్రాయాలతో ఆ ప్రాజెక్టుకు ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ అవసరం లేదని చెప్పారని వివరించారు. కేంద్రం రిపోర్టు ఆధారంగా ఎన్జీటీ తీర్పునిస్తే కృష్టా వాటర్ డిస్ ప్యూట్ ట్రిబ్యూనల్ ఎదుట తెలంగాణకు నష్టం వాటిల్లుతుందన్నారు. జడ్జిలు అనుమతిస్తే హెలికాప్టర్ లో తీసుకెళ్లి ఏపీ చేపట్టిన, చేపట్టబోయే ప్రాజెక్టులు, వాటి వల్ల పర్యావరణంపై పడే ప్రభావం, తెలంగాణకు జరిగే నష్టాన్ని చూపిస్తామని చెప్పారు. ఏపీ తరఫు న్యాయవాది వెంకటరమణి జోక్యం చేసుకుంటూ.. తాము చేపట్టబోయే ప్రాజెక్టు కేవలం జల వివాదానికి సంబంధించింది మాత్రమేనని, ఇందులో పర్యావరణం అంశమే లేదన్నారు . ప్రాజెక్టు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని బెంచ్ ను కోరారు.

ఒకే వ్యక్తి రెండు రిపోర్టులిచ్చారు

పిటిషనర్ తరఫున అడ్వకేట్ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఎన్జీటీ ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీ తరఫున, కేంద్ర అటవీ శాఖ పక్షాన ఒకే వ్యక్తి రిపోర్టును ఫైల్ చేశారని వివరించారు. జాయింట్ కమిటీ రిపోర్ట్ తో సంబంధం లేకుండా స్వతంత్రంగా స్టడీ చేసి నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించిందని, కేంద్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని తెలిపారు. ఏపీ చేపట్టేది కొత్త ప్రాజెక్టేనని, ఇందులో పర్యావరణంతో ముడి పడిన చాలా అంశాలు ఉన్నాయని వివరించారు.

పర్యావరణంపై తీవ్ర ప్రభావం

ఏఏజీ రామచందర్ రావు జోక్యం చేసుకుంటూ ఏపీ చేపట్టబోయే ప్రాజెక్టుల కాల్వలు మూడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ల గుండా వెళ్తున్నాయని, వాటిలో ఒక టైగర్ రిజర్వ్ కూడా ఉందని తెలిపారు. కిలోమీటర్ల పొడవునా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి కాలువలు తవ్వాల్సి ఉందని చెప్పారు . ఈ ప్రాజెక్టుతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటూ ఏపీని ఆదేశించాలన్నారు. విచారణ సెప్టెంబర్ మూడో తేదీకి వాయిదా పడింది. ఆ రోజు రెండు రాష్ట్రాలు జల వివాదాలు కాకుండా కేవలం పర్యావరణానికి సంబంధించిన అంశాలపైనే వాదనలు వినిపించాలని జ్యుడీషియల్ మెంబర్ స్పష్టం చేశారు.

మీ సెక్రటేరియట్ కు అనుమతులున్నాయా?

సంగమేశ్వరంపై ఎన్జీటీ విచారణ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేలా ఏపీని ఆదేశించాలని ట్రిబ్యునల్ ను ఏఏజీ రామచందర్ రావు కోరారు. వెంటనే డీషియల్ మెంబర్ జస్టిస్ రామకృష్ణన్ స్పందిస్తూ .. మీ (తెలంగాణ) సెక్రటేరియట్ నిర్మాణానికి అన్ని పర్మిషన్లు తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఊహించని ప్రశ్న ఎదురు కావడంతో ఏం చెప్పాలో తెలియక ఏఏజీ సతమతమయ్యారు. సమాధానం చెప్పకుండా దాటవేశారు.

ఏపీ తప్పుదోవ పట్టిస్తోంది

‘‘కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టినా దానికి టెక్నికల్ అప్రూవల్ తోపాటు పర్యావరణ ప్రాథమిక అనుమతులు, డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తప్పనిసరిగా ఉండాలి. ఇవేవి లేకుండానే పాత ప్రాజెక్టునే విస్తరిస్తున్నా మని చెబుతూ ఏపీ అందరినీ తప్పుదోవ పట్టిస్తోంది. ఏపీది చిన్నపాటి ప్రాజెక్టు కాదు. భారీ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతోంది’’ అని ఏఏజీ రామచందర్ రావు వివరించారు. చెన్నై తాగునీటి కోసం తెలుగు గంగ ప్రాజెక్టు కు 1,500 క్యూసెక్కుల కేటాయింపులు ఉన్నాయని, ఏపీ దానిని అతిక్రమిం చి ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44 వేల క్యూసెక్కులను తరలిస్తోందన్నారు. ఇప్పుడు దాని కెపాసిటీని 80 వేల క్యూసెక్కులకు పెంచడానికి పరిపాలన అనుమతులు ఇచ్చిందని చెప్పారు.