సంగమేశ్వరానికి.. పర్యావరణ అనుమతి అక్కర్లేదట!

సంగమేశ్వరానికి.. పర్యావరణ అనుమతి అక్కర్లేదట!
  • ఎక్స్​పర్ట్​ అప్రైజల్​ కమిటీ ముందు ఏపీ అడ్డగోలు వాదన

హైదరాబాద్‌‌, వెలుగు: శ్రీశైలం రిజర్వాయర్‌‌ నుంచి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేందుకు తలపెట్టిన సంగమేశ్వరం(రాయలసీమ) లిఫ్ట్‌‌ స్కీంకు పర్యావరణ అనుమతులు అక్కర్లేదని ఏపీ సర్కారు మళ్లీ పాత పాటే పాడుతోంది. నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్(ఎన్‌‌జీటీ) ఆదేశాలకు తూట్లు పొడుస్తూ పర్యావరణ అనుమతుల నుంచి తప్పించుకునే కుట్రలు చేస్తోంది. పాత ప్రాజెక్టుల ఆయకట్టును స్టెబిలైజ్‌‌ చేసేందుకే తాము ఎత్తిపోతలు మొదలు పెట్టామని, ఇది కొత్త ప్రాజెక్టు కాదని అడ్డగోలుగా వాదిస్తోంది. కొత్త స్టోరేజీ, కొత్త ఆయకట్టు లేదని, పవర్‌‌ జనరేషన్‌‌ కూడా చేయడం లేదు కాబట్టి పర్యావరణ అనుమతుల పరిధిలోకి ఈ ప్రాజెక్టు రాదని చెప్తోంది. ఎన్‌‌జీటీ ఎదుట ఇలాంటి వాదనే చేసినా వాటిని పరిగణనలోకి తీసుకోని ట్రిబ్యునల్‌‌.. పర్యావరణ అనుమతులు తప్పనిసరని ఆదేశిలిచ్చింది. డీపీఆర్‌‌ విషయంలోనూ అడ్డగోలు వాదనకే దిగి సీడబ్ల్యూసీతో చీవాట్లు తిన్న ఏపీ, ఎన్విరాన్‌‌మెంట్‌‌ క్లియరెన్స్‌‌ విషయంలోనూ అదే మొండి వైఖరి ప్రదర్శిస్తోంది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని ఎక్స్‌‌పర్ట్‌‌ అప్రైజల్‌‌ కమిటీ(రివర్‌‌ వ్యాలీ ప్రాజెక్ట్స్‌‌) 13వ మీటింగ్‌‌ గురువారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి ఏపీ వాటర్‌‌ రీసోర్సెస్‌‌ అధికారులు, ఇంజనీర్లు హాజరై సంగమేశ్వరానికి సంబంధించి మళ్లీ పాత వాదనే వినిపించారు.

పాత ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చేందుకే ఈ లిఫ్ట్: ఏపీ
తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు-నగరి ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వానికే సంగమేశ్వరం లిఫ్ట్‌‌ చేపట్టామని ఏపీ అధికారులు కమిటీకి వివరించారు. శ్రీశైలంలో 881 అడుగుల నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని డ్రా చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. ఏడాదిలో 20 రోజులకు మించి శ్రీశైలంలో అంత నీటిమట్టం మెయింటేన్‌‌ కావడం లేదన్నారు. రిజర్వాయర్‌‌ నీటిమట్టం 848 అడుగులకు పడిపోతే పోతిరెడ్డిపాడు నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని మాత్రమే తీసుకోగలమని చెప్పారు. తమ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉన్నా, శ్రీశైలంలో సరిపడా నీళ్లు ఉండటం లేదని, అందుకే ఎత్తిపోతల పథకం చేపట్టామని తెలిపారు. పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేందుకు లిఫ్ట్‌‌ స్కీం చేపట్టాం కాబట్టి దీనికి పర్యావరణ అనుమతులు అవసరం లేదని వివరించారు. ఏపీ అధికారులు చెప్పిన వివరాలపై స్టడీ చేసి నిర్ణయం తీసుకుంటామని ఎక్స్‌‌పర్ట్‌‌ అప్రైజల్‌‌ కమిటీ తెలిపింది.

ఎన్​జీటీ ఆదేశాలను పట్టించుకోలే
పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ సమీపంలో సంగమేశ్వరం లిఫ్ట్‌‌ స్కీం పనులను ఏపీ వేగంగా చేస్తోంది. రోజుకు 3 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసేలా రిజర్వాయర్‌‌ నుంచి అప్రోచ్‌‌ చానల్‌‌, సర్జ్‌‌పూల్‌‌, పంపుహౌస్‌‌, డెలివరీ మెయిన్స్‌‌ నిర్మాణాలు చేపట్టింది. కానీ, చెన్నైలోని ఎన్‌‌జీటీ సదరన్‌‌ బెంచ్‌‌కు మాత్రం తాము సర్వే పనులే చేస్తున్నామని తెలిపింది. వర్క్‌‌ సైట్‌‌ను సందర్శించి ప్రాజెక్టు పనులపై తమకు నివేదిక ఇవ్వాలని ఎన్‌‌జీటీ.. కృష్ణా బోర్డును ఆదేశించింది. పనుల సందర్శనకు వస్తామని బోర్డు సభ్యులు, ఇంజనీర్లు రెండుసార్లు లేఖలు రాసినా ఏపీ ససేమిరా అంది. పర్యావరణ ప్రభావ అంచనా-2006 ప్రకారం నోటిఫికేషన్‌‌ ఇచ్చి ఎన్విరాన్‌‌మెంట్‌‌ క్లియరెన్స్‌‌ కోసం పబ్లిక్‌‌ హియరింగ్‌‌ నిర్వహించాలని ఎన్‌‌జీటీ ఏపీని ఆదేశించింది. ఇంతవరకు అలాంటి ప్రయత్నమేది చేయలేదు.

డీపీఆర్‌‌ విషయంలోనూ ఇలాగే
సంగమేశ్వరం డీపీఆర్‌‌ విషయంలోనూ ఏపీ ఇలాగే అడ్డగోలు వాదనతో కాలం వెళ్లదీసింది. పాత ప్రాజెక్టులకు నీళ్లిచ్చే స్కీం కాబట్టి డీపీఆర్‌‌ ఇవ్వాల్సిన అవసరం లేదని, అందుకే డీటైల్డ్‌‌ ప్రాజెక్టు ఇన్ఫర్మేషన్‌‌(డీపీఐ) ఇస్తున్నామని సీడబ్ల్యూసీకి చెప్పి చీవాట్లు తిన్నది. డీపీఆర్‌‌ రాయడం నేర్చుకోవాలని సీడబ్ల్యూసీ ఘాటుగా లేఖ రాయడంతో ఏపీ దిగివచ్చింది. ఇప్పుడు ఎన్విరాన్‌‌మెంట్‌‌ క్లియరెన్స్‌‌ విషయంలోనూ దొడ్డిదారులు వెతుకుతోంది. ఏపీ ప్రయత్నాలకు తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని దక్షిణ తెలంగాణ ప్రాంత ఇంజనీర్లు డిమాండ్‌‌ చేస్తున్నారు. మళ్లీ ఎన్‌‌జీటీలో పిటిషన్‌‌ దాఖలు చేసైనా పర్యావరణ అనుమతులపై ఆదేశాలు అమలయ్యేలా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.