ఆస్తుల విభజనపై సీఎస్‌ల భేటీ

ఆస్తుల విభజనపై సీఎస్‌ల భేటీ
  • 9, 10 షెడ్యూళ్ల’లోని సంస్థల విభజనపై చర్చ
  • జులై 3న గవర్నర్‌తో భేటీకి ఎజెండా ఖరారు

హైదరాబాద్‌, వెలుగు: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజనకు ముందడుగు పడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల సీఎస్‌లు, ముఖ్య సలహాదారులు శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో సమావేశమై విభజనపై చర్చలు జరిపారు. జల వివాదాల పరిష్కారం, గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించడం, ఢిల్లీలోని ఏపీ భవన్‌ ఆస్తుల విభజనపై చర్చించారు. పెండింగ్‌ బిల్లులు, బకాయిల చెల్లింపు, ఏపీ, తెలంగాణలో పని చేస్తున్న డీఎస్పీ స్థాయి అధికారులకు పదోన్నతులు, వారి విభజనపైనా చర్చించినట్టు తెలిసింది. జులై 3న గవర్నర్‌ సమక్షంలో రెండు రాష్ట్రాల అధికారుల భేటీ ఉండటంతో ఆ సమావేశం ఎజెండానూ ఖరారు చేశారు. వివాదాల్లేని సంస్థల విభజనను గవర్నర్‌కు ఆ రోజే నివేదించనున్నారు. వెంటనే విభజన పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్‌తో భేటీ తర్వాత రెండు రాష్ట్రాల ప్రభుత్వాధికారుల తదుపరి సమావేశం తిరుపతిలో జులై 10లోగా నిర్వహించనున్నట్టు తెలిసింది. భేటీలో సీఎస్‌లు ఎస్‌కే జోషి, ఎల్వీ సుబ్రమణ్యం, ముఖ్య సలహాదారులు రాజీశ్‌ శర్మ, అజయ్‌ కల్లం, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.