గోదావరి, కృష్ణా లింక్​పై పురి కలుస్తలేదు!

గోదావరి, కృష్ణా లింక్​పై పురి కలుస్తలేదు!
  • రెండు రాష్ట్రాల ఇంజనీర్ల మధ్య కుదరని ఏకాభిప్రాయం
  • పోలవరం నుంచి నాగార్జున సాగర్‌కు లింక్‌ చేయాలంటున్న తెలంగాణ
  • తుపాకులగూడెం, అకినేపల్లి నుంచి శ్రీశైలానికి ఎత్తిపోయాలంటున్న ఏపీ
  • నేడు, రేపు జలసౌధలో ఇరు రాష్ట్రాల ఇంజనీర్ల భేటీ
  • ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉంటారా? ఏకాభిప్రాయానికి వస్తారా?

ఏపీ ఇంజనీర్లు ఇట్లంటున్నరు

తుపాకులగూడెంకు దిగువన 500 టీఎంసీలకు పైగా నీటి లభ్యత ఉంటుంది. అక్కడి నుంచి కనీసం 250 టీఎంసీలను తరలించాలి. ఈ నీటిని ఓపెన్‌ కెనాళ్లు, టన్నెళ్ల ద్వారా మొదట నాగార్జునసాగర్‌కు అక్కడి నుంచి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించాలి. అకినేపల్లి నుంచి రెండో లిఫ్టు ద్వారా నాగార్జునసాగర్‌కు, అటు నుంచి శ్రీశైలానికి తరలించాలి. అకినేపల్లి వద్ద గోదావరి నీటి మట్టం 237 అడుగులు కాగా శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. ఈ లెక్కన 648 ఫీట్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయాలి.

మన ఇంజనీర్లు ఇట్ల చేద్దమంటున్నరు

దుమ్ముగూడెం నుంచి 165 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్‌కు తరలించడానికి ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతిపాదన చేశారు. దుమ్ముగూడెం వద్ద 200 టీఎంసీలకు పైగా నీటిని తీసుకునే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌కు నీటిని తరలించి రివర్సబుల్‌ పంపింగ్‌ ద్వారా అదే ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోయవచ్చు. పోలవరం నుంచి వైకుంఠపురం బ్యారేజీకి, అక్కడి నుంచి పులిచింతల మీదుగా నాగర్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌లో ఎత్తిపోయాలి.

హైదరాబాద్‌, వెలుగు: గోదావరి, కృష్ణా నదుల లింక్‌పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఇంజనీర్ల మధ్య పురి కలుస్తలేదు. తెలంగాణ చేసే ప్రతిపాదనలు తమకు ఆమోదయోగ్యం కాదని ఏపీ ఇంజనీర్లు చెప్తున్నారు. ఏపీ ఇంజనీర్లు పెడుతున్న ప్రతిపాదనలు ఆచరణలో కష్టమని తెలంగాణ ఇంజనీర్లు తేల్చేస్తున్నారు. దీంతో  మంగళవారం నుంచి జరిగే సమావేశాల్లో వారి మధ్య ఏకాభిప్రాయం వస్తుందా, లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇరు రాష్ట్రాల సీఎంలు గోదావరిలోని మిగులు జలాలను శ్రీశైలం ప్రాజెక్టు వరకు తరలించేందుకు అవసరమైన ప్లాన్​ను సిద్ధం చేయాలని ఇటీవల ప్రగతిభవన్​లో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల ఇంజనీర్లను ఆదేశించారు. దీంతో ఎవరికి వారే తమ రాష్ట్రానికి అనువైన ప్రపోజల్స్‌ తయారు చేయడంపై ఫోకస్‌ పెట్టారు. సీఎంల భేటీలో గోదావరి, కృష్ణా లింక్‌పై ఐదు ప్రతిపాదనలు రాగా వాటిలో ఏ పాయింట్‌ నుంచి తక్కువ ముంపు, తక్కువ వ్యయంతో ఎక్కువ నీటిని తరలించగలమో డిటైల్డ్‌ రిపోర్టు సిద్ధం చేయాలని సూచించారు. జులై 15లోగా ఇంజనీర్ల కమిటీ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు నేతృత్వంలోని ఇంజనీర్ల టీమ్​ జూన్‌ 28న జలసౌధలో సమావేశమై ప్రతిపాదనలపై చర్చించింది. మంగళవారం తిరిగి భేటీ కావాలని అదే రోజు నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ఇంజనీర్ల టీమ్​ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకొని జలసౌధలో తెలంగాణ ఇంజనీర్ల లీమ్​ను కలిసే అవకాశం ఉంది. బుధవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు రెండు రాష్ట్రాల ఇంజనీర్ల సమావేశమై ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలపై చర్చించనున్నారు.

ఏపీ ప్రతిపాదనలు ఇవీ..

ఏపీ ఇంజనీర్లు గోదావరి నదిలో ఇంద్రావతి ఉప నది కలిసిన తర్వాత తుపాకులగూడెంకు దిగువన 500 టీఎంసీలకు పైగా నీటి లభ్యత ఉన్నట్టు చెప్తున్నారు. అక్కడి నుంచి కనీసం 250 టీఎంసీలను తరలించాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ నీటిని ఓపెన్‌ కెనాళ్లు, టన్నెళ్ల ద్వారా మొదట నాగార్జున సాగర్‌కు అక్కడి నుంచి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించాలని అంటున్నారు. అకినేపల్లి నుంచి రెండో లిఫ్టు ద్వారా నాగార్జున సాగర్‌కు, అక్కడి నుంచి శ్రీశైలానికి నీటిని తరలించాలని కోరుతున్నారు. అకినేపల్లి వద్ద గోదావరి నీటి మట్టం 237 అడుగులు కాగా శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. ఈ లెక్కన 648 ఫీట్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయాలని ఏపీ అధికారులు వాదిస్తున్నారు. ఇక్కడి నుంచి నీటిని తరలిస్తే రిజర్వ్‌ ఫారెస్ట్‌, వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాల ప్రభావం కూడా తక్కువగా ఉంటుందని, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని మైదాన ప్రాంతాల గుండా ఓపెన్‌ కెనాళ్లు, టన్నెళ్లు తవ్వవచ్చని ఇంజనీర్లు పేర్కొంటున్నారు.

తెలంగాణ ప్రతిపాదనలు ఇవీ..

దుమ్ముగూడెం నుంచి 165 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్‌కు తరలించడానికి ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతిపాదన చేసిన విషయాన్ని రాష్ట్ర ఇంజనీర్లు ముందుకు తెస్తున్నారు. దుమ్ముగూడెం వద్ద 200 టీఎంసీలకు పైగా నీటిని తీసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అక్కడి నుంచి నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌కు నీటిని తరలించి రివర్సబుల్‌ పంపింగ్‌ ద్వారా నాగార్జునసాగర్​ ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోయవచ్చని అంటున్నారు. ఇందుకోసం 244 కి.మీ.ల లింక్‌ కెనాల్‌ అవసరమని, 6 చోట్ల ఓపెన్‌ పంపుహౌస్‌లు, లిఫ్టులు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. లింక్‌ కెనాల్‌, లిఫ్టుల కోసం 19,785 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని, ఇందులో అటవీ భూమి 3,701 ఎకరాలు అని లెక్క కట్టారు. పోలవరం నుంచి వైకుంఠపురం బ్యారేజీకి, అక్కడి నుంచి పులిచింతల మీదుగా నాగర్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌లో పోయాలని ప్రతిపాదిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు యేటా గరిష్టంగా 500 టీఎంసీల వరకు వరద వస్తుందని, గడిచిన 47 ఏళ్ల సీడబ్ల్యూసీ గణాంకాలు పరిశీలిస్తే కేవలం మూడేళ్లలోనే నాగార్జున సాగర్‌కు అనుకున్న స్థాయిలో వరద రాలేదని రాష్ట్ర ఇంజనీర్లు చెప్తున్నారు. ఏపీ ఇంజనీర్లు ఈ వాదనను కొట్టి పారేస్తున్నారు.

ఈ అంశాలపైనే ఎక్కువ చర్చ

ఇంజనీర్ల ఉమ్మడి భేటీలోనూ తెలంగాణ,ఏపీ అధికారులు ఎవరి ప్రతిపాదనలువారే సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసిం ది. వారి సమావేశంలో రిజర్వ్‌‌ ఫారెస్ట్‌‌, వైల్డ్‌‌ లైఫ్‌ శాంక్చూరీల గుండా కాలువలు, టన్నెళ్ల తవ్వకం, పంపుహౌస్‌‌ల ఏర్పాటుపైనే ఎక్కువగా చర్చ సాగనుంది.అకినేపల్లి, తుపాకులగూడెం నుంచి నీటిని తరలించాలని ఏపీ బలంగా వాదించే అవకాశముండగా, దుమ్ముగూడెం, పోలవరం నుంచి నీటిని తరలిస్తేనే మంచిదనే వాదన వినిపించేందుకు తెలంగాణ సిద్ధమవుతోంది.