శ్రీశైలంలో నీళ్లన్నీ తోడేసిన ఏపీ

శ్రీశైలంలో నీళ్లన్నీ తోడేసిన ఏపీ
  • డ్యామ్​లో ఇంకా మిగిలింది 42 టీఎంసీలే
  • కనీస మట్టం కన్నా 11 అడుగులు కిందికి నీళ్లు
  • ఎండాకాలం ముగిసే సరికి ఇంకా పడిపోనున్న నీటిమట్టం
  • 173 టీఎంసీలు తరలించుకుపోయిన ఏపీ
  • తెలంగాణ వినియోగం 26 టీఎంసీలే
  • హైదరాబాద్​కు పొంచివున్న తాగునీటి కష్టాలు

హైదరాబాద్‌, వెలుగు: శ్రీశైలం రిజర్వాయర్‌లో నీళ్లన్నీ ఏపీ తోడేసింది. మార్చి నెలాఖరు వరకు ఏపీ, తెలంగాణ కలిపి 200 టీఎంసీల నీటిని వాడుకుంటే అందులో ఏపీ 173 టీఎంసీలను తరలించుకుపోయింది. తెలంగాణ కేవలం 27.58 టీఎంసీలతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం 42 టీఎంసీలు మాత్రమే నీళ్లు నిల్వ ఉన్నాయి. కనీస మట్టం కన్నా 11 అడుగులు కిందికి పడిపోయాయి. ఎండాకాలం అయిపోయే సరికి నీటి మట్టం ఇంకా పడిపోనుంది. ఇప్పటిదాకా తరలించిన నీటిలో ఏపీ వాటా 84 శాతం కాగా, తెలంగాణ వాటా కేవలం 16 శాతం మాత్రమే. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే సంగమేశ్వరం లిఫ్ట్‌ స్కీం పూర్తయి, అది అందుబాటులోకి వస్తే తెలంగాణకు నీటి చుక్క దక్కదని దక్షిణ తెలంగాణ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

శ్రీశైలం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు ఈ వానాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 1,782 టీఎంసీల నీళ్లు వచ్చాయి. రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ పూర్తి స్థాయి మట్టం 885 అడుగులు కాగా, నిల్వ 215.81 టీఎంసీలు. వానలు ఎక్కువ పడడంతో రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ గేట్లు దాదాపు రెండు నెలలు ఎత్తి నీటిని కిందికి వదిలేశారు. ఇక మార్చి నెలాఖరు వరకు శ్రీశైలం నుంచి 200 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలు వాడుకున్నాయి. అందులో ఏపీ 173 టీఎంసీలను తరలించుకుపోగా, తెలంగాణ కేవలం 27.58 టీఎంసీలతో సరిపెట్టుకుంది. ఇందులో చెన్నై తాగునీటి కోటా కింద విడుదల చేసిన 1.66 టీఎంసీలు మినహాయిస్తే.. మన వాడకం కేవలం 26 టీఎంసీలే.

మనపై ఫిర్యాదు చేసి ఏపీ కరెంట్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి

శ్రీశైలం లెఫ్ట్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌ నుంచి తెలంగాణ కరెంట్‌‌‌‌‌‌‌‌ తయారు చేస్తోందని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఈ మధ్య ఫిర్యాదు చేసింది. కానీ తాను మాత్రం ఇష్టారాజ్యంగా కరెంట్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ కొనసాగించింది. నాలుగు రోజుల కింది వరకు తెలంగాణతో పోటీగా ఏపీ కరెంట్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి చేసింది. కానీ తెలంగాణ కరెంట్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌తోనే శ్రీశైలంలో నీటి నిల్వ పడిపోతోందని ఆరోపించింది. ఈ ఏడాది తెలంగాణపై నాలుగు సార్లు బోర్డుకు ఫిర్యాదు చేసింది. మనవైపున శ్రీశైలం లెఫ్ట్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌లో వరుసగా కరెంట్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ కొనసాగించడంతో అగ్ని ప్రమాదం జరిగి రెండు నెలలకు పైగా ఉత్పత్తి నిలిచిపోయింది. ఆ సమయంలో ఏపీ పూర్తి సామర్థ్యం మేరకు కరెంట్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి చేసుకుంది. శ్రీశైలం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ నిర్మించిందే కరెంట్‌ కోసమన్న విషయాన్ని తొక్కి పెట్టి.. రాయలసీమకు సాగు, తాగునీటి కోసం శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం మెయింటెయిన్‌‌‌‌‌‌‌‌ చేయాలంటూ ఒత్తిడి తెస్తోంది.

సాగర్‌‌‌‌‌‌‌‌లోనూ ఏపీనే

కృష్ణాలో వరద తగ్గిన తర్వాత శ్రీశైలం పవర్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌ల ద్వారా నీటిని నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌కు విడుదల చేస్తారు. ఇలా సాగర్‌‌‌‌‌‌‌‌కు విడుదల చేసే నీటిలోనూ ఏపీనే ఎక్కువ ఉపయోగించుకుంది. ఆ నిజాన్ని దాచి తెలంగాణ కరెంట్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తిని నిలిపివేయాలని తరచూ కొర్రీలు పెడుతోంది. సాగర్‌‌‌‌‌‌‌‌ నుంచి ఈ వరద కాలంలో మార్చి నెలాఖరు వరకు 483 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలు వాడుకున్నాయి. ఇందులో ఏపీ 342, తెలంగాణ 141 టీఎంసీలు తీసుకున్నాయి. రెండు ప్రాజెక్టుల్లో కలిపి ఏపీ 542 టీఎంసీలను తీసుకుంటే, తెలంగాణ కేవలం 167 టీఎంసీలకే పరిమితమైంది. మన రాష్ట్రానికి ఇంకా 84 టీఎంసీల నీటి వాటా ఉండగా, ఏపీ 12.87 టీఎంసీలను అదనంగా తరలించుకుపోయింది. కోటాకు మించి నీటిని తీసుకున్న ఏపీని కట్టడి చేయలేకపోతున్న కృష్ణా బోర్డు.. తెలంగాణ కరెంట్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తిపై ఏకంగా కేంద్ర విద్యుత్‌‌‌‌‌‌‌‌ శాఖకు ఫిర్యాదు చేసింది. బోర్డు ఏకపక్ష వ్యవహార శైలిని ఎండగట్టడంలోనూ తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా పనిచేయడం లేదనే ఆరోపణలున్నాయి.

పోతిరెడ్డిపాడు నుంచే 124 టీఎంసీలు

ఏపీ ఒక్క పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచే 124 టీఎంసీల నీటిని తరలించుకుంది. ప్రాజెక్టుకు వరద పోటెత్తి గేట్లు ఎత్తినప్పుడు తాము వినియోగించుకున్న 77 టీఎంసీలను ఇందులోంచి మినహాయించాలని ఏపీ కోరుతోంది. హంద్రీనీవా లిఫ్ట్‌ స్కీంకు 41 టీఎంసీలు, ముచ్చుమర్రి లిఫ్ట్‌, చెన్నై తాగునీటికి కలిపి ఇంకో ఏడు టీఎంసీలను ఏపీ తీసుకుంది. తెలంగాణ మాత్రం కల్వకుర్తి లిఫ్ట్‌ స్కీం ద్వారా 25.91 టీఎంసీలే ఈ ఏడాది మొత్తం తీసుకోగలిగింది.

సంగమేశ్వరం పూర్తయితే?

శ్రీశైలం నుంచి తమకు రావాల్సిన నీటిని దక్కకుండా తెలంగాణ అడ్డుకుంటోందని ఆరోపిస్తూ ఏపీ సంగమేశ్వరం లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్కీంను చేపట్టింది. ఇప్పుడే శ్రీశైలం నుంచి 84 శాతం నీటిని తరలించుకున్న ఏపీ.. ఆ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ను ఖాళీ చేస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అదే జరిగితే నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ ఎడమ కాలువ, ఏఎంఆర్పీ ఆయకట్టుతో పాటు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ తాగునీటికి కష్టాలు తప్పవు. శ్రీశైలంపై ఆధారపడి తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు – రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్కీంలు, ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్బీసీ టన్నెల్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు భవిష్యత్‌ ప్రమాదంలో పడనున్నాయి. మనకు ప్రమాదకరంగా మారిన సంగమేశ్వరాన్ని అడ్డుకునేందుకు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలని, లేకుంటే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.