
తిరుమల.. తిరుమల వెంకన్న.. తిరుమల శ్రీవారు.. కలియుగంలో ప్రత్యక్ష దేవుడు.. అతని ప్రసాదం లడ్డూ.. తిరుమల లడ్డూ.. శ్రీవారి లడ్డూ.. శ్రీనివాసుని లడ్డూ.. ఇది మహా ప్రసాదం.. మహా పవిత్రం.. తిరుమల లడ్డూలో చిన్న తేడా వచ్చినా అది భూగోళం మొత్తం చర్చనీయాంశం.. మొన్నటికి మొన్న శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ అనే వార్త కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. అది చల్లారనేలేదు.. ఇప్పుడు శ్రీనివాస లడ్డూ పేరుతో తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరులోని ఓ ప్రముఖ హోటల్ లో లడ్డూ విక్రయాలు కలకలం రేపుతోంది.
వాస్తవంగా తిరుమల లడ్డూకు.. తిరుమల లడ్డూ పేరుకు పేటెంట్ ఉంది. ఈ పేరుతో ఎవరూ లడ్డూలు తయారు చేయకూడదు.. వాటిని అమ్మకూడదు. ఇది చట్టరీత్యా నేరం. తిరుమల శ్రీవారి లడ్డూ తరహాలో.. ప్రసాదం లడ్డూలో ఉపయోగించే పదార్థాలతో లడ్డూలు తయారు చేయటం అనేది నేరం.. అలాంటిది తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రముఖ హోటల్స్ లో శ్రీనివాస లడ్డూ అని తిరుమల శ్రీవారి లడ్డూ తరహాలో లడ్డూలు అమ్మటం.. వాటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ శ్రీనివాస లడ్డూ కేజీ 740 రూపాయలు అంట.. అచ్చం తిరుమల శ్రీవారి లడ్డూ తరహాలోనే చూడటానికి ఉన్నాయి. అదే తరహాలో లడ్డూలను తయారు చేసి.. శ్రీనివాస లడ్డూ పేరుతో హోటల్స్ లో అమ్మటం.. వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంది. శ్రీనివాసుడు అంటే తిరుమల వెంకన్న.. కలియుగ ప్రత్యక్ష దైవం.. కోటాను కోట్ల మందికి ఆరాధ్య దైవం. అలాంటి శ్రీనివాసుని పేరుతో ఆ హోటల్స్ లో లడ్డూలు అమ్మటంపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు, నెటిజన్లు. టీటీడీ తీసుకునే చర్యలపై అందరిలో ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో ఫొటోలు తిరుగుతున్నా.. ఇప్పటి వరకు హోటల్ యాజమాన్యం కూడా స్పందించలేదు..