
- వాటర్ రిలీజ్ ఆర్డర్ లేకుండా ఏకపక్షంగా విడుదల
- పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల పెంపు
- కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు
హైదరాబాద్/ హాలియా, వెలుగు: ప్రాజెక్టుల్లోకి వరద రావడమే ఆలస్యం అన్నట్లుగా ఏపీ జల దోపిడీకి పాల్పడుతోంది. ఇప్పటికే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా అనధికారికంగా నీటిని తరలించుకుపోతున్న పొరుగు రాష్ట్రం.. ఇప్పుడు సాగర్ నుంచి కూడా అదే పనిచేస్తోంది. కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే శ్రీశైలం నుంచి నీటిని రాయలసీమకు తన్నుకుపోతున్న ఏపీ.. గురువారం నాగార్జునసాగర్ కుడి కాల్వ గేట్లను తెరిచింది. ప్రస్తుతం 500 క్యూసెక్కుల నీటినే దిగువకు తీసుకుపోతున్నా.. ఒకట్రెండు రోజుల్లో 5 వేల క్యూసెక్కులకు పెంచేలా ఏర్పాట్లు చేసుకుంటోంది.
కాగా, ఏపీ తీరుపై తెలంగాణ ఇరిగేషన్ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కృష్ణా బోర్డుకు గురువారం ఫిర్యాదు చేశారు. ఏపీని కట్టడి చేయాలని కోరారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జున సాగర్‌ను తెలంగాణ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, ఏపీ మాత్రం కుటిల ప్రయత్నాల్లో భాగంగా మన అధికారులతో గొడవకు దిగి సాగర్ కుడివైపు భాగాన్ని ఆక్రమించుకున్నది.
అప్పటినుంచి తనకు కావాల్సినప్పుడల్లా కుడి కాల్వ గేట్లను ఆపరేట్ చేస్తున్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సాగర్‌లో నీళ్లు డెడ్ స్టోరేజీకి చేరినా నీటి తరలింపు ఆపలేదు. తాజాగా సాగర్ పూర్తిగా నిండకముందే జలాలను దిగువకు తరలించుకపోతోంది. కనీసం కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండానే ఏకపక్షంగా నీటిని తీసుకెళ్లడాన్ని తెలంగాణ ఇరిగేషన్ ఆఫీసర్లు తప్పుపడ్తున్నారు.
సాగర్‌ను మాకు ఇవ్వండి..
నాగార్జునసాగర్ డ్యామ్‌ను పర్యవేక్షించేందుకు తమకు అనుమతివ్వాలని తెలంగాణ అధికారులు కృష్ణా బోర్డును కోరారు. ఈ మేరకు తాజాగా బోర్డుకు సాగర్ ప్రాజెక్టు అధికారులు లేఖ రాశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అర్ధరాత్రి వేళ ఏపీ అధికారులు డ్యామ్‌లోని 13వ నంబర్ వరకు ఉన్న గేట్లను ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. కేఆర్ఎంబీ ఆదేశాలు లేనిదే ఎవరినీ డ్యామ్‌పైకి రానివ్వకూడదని సీఆర్పీఎఫ్ బలగాలకు సైతం కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది.
బోర్డు ఉత్తర్వులతోనే ఇరు రాష్ట్రాల అధికారులు డ్యామ్‌పైకి వెళ్లి వస్తున్నారు. అయితే ప్రస్తుతం సాగర్ డ్యామ్ 575 ఫీట్ల లెవెల్‌కు చేరుకున్న నేపథ్యంలో, పర్యవేక్షణ కోసం గ్యాలరీ, డ్యామ్‌పైకి వెళ్లేందుకు అనుమతివ్వాలని బోర్డును కోరారు. డ్యామ్ పర్యవేక్షణ విధుల్లో 3 డివిజన్ల అధికారులు షిఫ్టుల వారీగా పాల్గొంటారని, ప్రతిసారి ప్రతి ఒక్కరి పేరిట అనుమతులు తీసుకోవడం ఇబ్బందికరంగా మారిందని వివరించారు. సాగర్ కుడికాలువ హెడ్ రెగ్యులేటరీ, 13వ నంబర్ వరకు ఉన్న గేట్ల నిర్వహణనూ అప్పగించేలా చొరవ తీసుకోవాలని తెలంగాణ ఈఎన్సీకి కూడా డ్యామ్ అధికారులు లేఖ రాసినట్లు తెలిసింది.
పోతిరెడ్డిపాడు నుంచి పెంపు..
పోతిరెడ్డిపాడు నుంచి నిన్నటిదాకా 20 వేల క్యూసెక్కులు తీసుకెళ్లిన పొరుగు రాష్ట్రం.. తాజాగా దానిని 24,400 క్యూసెక్కులకు పెంచింది. తద్వారా రాయలసీమలోని రిజర్వాయర్లను వేగంగా నింపుకునే పనిలో పడింది. అనధికారికంగా ఇంతకు మించి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపైనా కృష్ణా బోర్డుకు తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు.
వాటర్ రిలీజ్ ఆర్డర్స్ లేకుండానే కృష్ణా జలాలను ఏపీ తరలిస్తోందని ఆరోపించారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా నీటి తరలింపును చేపడుతున్నందున వెంటనే అడ్డుకోవాలని కోరారు. ఇంకా సాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండకుండానే.. ఔట్ సైడ్ బేసిన్‌కు తరలించడం ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు.