
మూడు వన్డేల సిరీస్ కోసం ఇండియాలో పర్యటించిన ఆస్ట్రేలియా 'ఏ' ఆటగాళ్లకు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. కొంతమంది ఆసీస్ ఆటగాళ్లు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. సిరీస్ లో భాగంగా మూడో వన్డేకు ముందు ఆస్ట్రేలియా ఎ ఫాస్ట్ బౌలర్ హెన్రీ థోర్న్టన్ ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆసుపత్రిలో చేరాడు. థోర్న్టన్ కడుపులో ఇన్ఫెక్షన్ ఉందని తేలడంతో కాన్పూర్‌లోని రీజెన్సీ ఆసుపత్రిలో చేరి రెండు రోజులు అక్కడే ఉన్నాడు. కాన్పూర్ హోటల్‌లో ఆహారం తిన్న తర్వాత థోర్న్టన్ జీర్ణశయాంతర సమస్యలను ఎదుర్కొన్నాడు.
ఈ ఆసీస్ పేసర్ పరిస్థితి మరింత దిగజారడంతో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. సీనియర్ వైద్యులు అతనికి చికిత్స చేసిన తర్వాత డిశ్చార్జ్ చేశారు. థోర్న్టన్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. థోర్న్టన్ తో పాటు మరో ముగ్గురు ఆస్ట్రేలియన్ ఆటగాళ్లకు కూడా ఫుడ్ పాయిజనింగ్ అయిందని సమాచారం. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆస్ట్రేలియన్ ఏ జట్టు యాజమాన్యం ఆటగాళ్ల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. వెంటనే కొత్త ఆహార ప్రణాళికను అమలు చేశారు. ఆటగాళ్లు బయటి ఆహారాన్ని తినకుండా నిషేధించారు. వైద్య సిబ్బంది, పోషకాహార నిపుణుల పర్యవేక్షణలో వారికి ప్రత్యేకంగా తయారుచేసిన పోషకమైన భోజనం మాత్రమే వడ్డిస్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన రాజీవ్ శుక్లా
బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ సంఘటనపై స్పందించారు. ఆసీస్ ఆటగాళ్లకు ఈ సమస్య వేరే కారణాల వచ్చి ఉంటుందని తెలిపాడు. "ఆహార సమస్య ఉంటే భారత ఆటగాళ్లతో సహా అందరు ఆటగాళ్లు అనారోగ్యానికి గురయ్యేవారు. వారి అనారోగ్యం వేరేది అయి ఉండాలి. వారికి అత్యుత్తమ హోటళ్లలో ఒకటైన హోటల్ ల్యాండ్‌మార్క్ నుండి ఆహారం అందిస్తున్నారు. ఆహారం బాగుంది. అందరూ ఒకేలా తింటున్నారు. కొంతమంది ఆటగాళ్లు అనారోగ్యానికి గురైనందున, వారికి ఇన్ఫెక్షన్ సోకి ఉండవచ్చు. మేము ఆ సమస్యను పరిష్కరిస్తాం". అని శుక్లా చెప్పుకొచ్చారు.
సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా ఏ:
శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని ఇండియా ఏ జట్టు ఆస్ట్రేలియా ఏ జట్టుపై సత్తా చాటింది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది. నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై రెండు వికెట్ల తేడాతో భారీ ఛేజింగ్ చేసి సిరీస్ నెగ్గింది. ఆదివారం (అక్టోబర్ 5) కాన్పూర్ వేదికగా జరిగిన ఈ హై స్కోరింగ్ మ్యాచ్ లో ఇండియా తరపున ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (68 బంతుల్లో 102: 8 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఏ 49.1 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో ఇండియా 46 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసి విజయం సాధించింది.
Some Australian players fallen ill in Kanpur.
— cricFusion Aashi (@cricket_x_Ashi) October 5, 2025
- Might be the case of food poisioning pic.twitter.com/03gliEF7qn