20 వేల కోట్లకు అధిపతి..90 ఏండ్ల వయసులో 6 రోజులు ఆఫీసుకు..

 20 వేల కోట్లకు అధిపతి..90 ఏండ్ల వయసులో 6 రోజులు ఆఫీసుకు..

20 వేల కోట్లు..90 ఏండ్ల వయసు. ఈసమయంలో ఎవరైనా ఏమనుకుంటారు. సంపాదించింది చాలు. విశ్రాంతి తీసుకుందాం. జీవితాన్ని సంతోషంగా గడుపుదాం అని. కానీ  అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్, డాక్టర్  ప్రతాప్ సి రెడ్డి మాత్రం అలా అనుకోరు.  ఆయన 90 ఏండ్ల వయసులోనూ యువకుడి మాదిరిగా ఉత్సాహంగా తన విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికీ ప్రతీ రోజూ యువ వైద్యుల వలే తన వైద్య వృత్తిని అంకితభావంతో నిర్వర్తిస్తున్నారు. ఈ వయసులో కూడా వారానికి ఆరు రోజుల పాటు ఆసుపత్రికి వెళ్తున్నారు. ఈ అంకితభావం, ఈ కృషి వల్లే  ఆయన్ను విజయాలు వరించాయి. 

డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి దేశంలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యాపారవేత్తలలో ఒకరు. తన జీవితంలో అన్ని సాధించిన ఆయన..ఇప్పటికీ చురుగ్గా వైద్య వృత్తిని నిర్వర్తిస్తారు. 1983లో చెన్నైలో ‘అపోలో ఆసుపత్రి’ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెన్నైలోని తన కార్యాలయానికి వెళ్తూ వస్తున్నారు. వారంలో ఒక రోజు మాత్రమే సెలవు తీసుకుంటారు. ఆరు రోజుల పాటు .. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అపోలో ఆసుపత్రికి వెళ్తారు. 

డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికి  తన నలుగురు కుమార్తెలు, ప్రీతారెడ్డి, సునీతారెడ్డి, శోభనా కామినేని, సంగీత రెడ్డి. వీరిలో ప్రీతారెడ్డి అపోలో ఆసుపత్రులకు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. సంగీత రెడ్డి జాయింట్ MD, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్‌లుగా సునీత, శోభన ఉన్నారు. వీరంతా అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో కీలక పాత్రలను నిర్వహిస్తూ..విజయవంతమయ్యారు. ఎన్నో  అవార్డులను గెలుచుకున్నారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రుల సంస్థ రూ. 70,000 కోట్ల మార్కెట్ క్యాప్‌తో లిస్టెడ్ కంపెనీలో 29.3%  వాటాను కలిగి ఉంది. అపోలో సంస్థ  కింద 21 కంపెనీలు ఉన్నాయి.  ఇందులో 5,000 ఫార్మసీ స్టోర్‌లు, 291 ప్రైమరీ కేర్ క్లినిక్‌లు, డిజిటల్ హెల్త్ పోర్టల్, డయాగ్నోస్టిక్స్ చైన్, 71 ఆసుపత్రులతో కూడిన ఫ్లాగ్‌షిప్ చైన్ కాకుండా ప్రసూతి సేవలు కూడా ఉన్నాయి.

తన వ్యాపార సామ్రాజ్యంలో కూతుర్లను విజయవంతం చేసిన డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి..మూడో తరం సక్సెస్ లోనూ కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. అందుకోసమే ఇప్పటికీ 90 ఏండ్ల వయసులోనూ పనిచేస్తున్నారు. డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికి 10 మంది మనవలు ఉన్నారు, వీరందరి ఆసక్తి ఏంటో చెప్పాలని కోరారు. దీని ద్వారా వారికి కీలక బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నారు. 

డాక్టర్ ప్రతాప్ చంద్రా రెడ్డి చిత్తూరు జిల్లా, తవణంపల్లె మండలం ఆరగొండలో1933 ఫిబ్రవరి 5న జన్మించారు. ఆయన కార్డియాలజిస్ట్. దేశంలో మొట్టమొదటి కార్పొరేట్ ఆసుపత్రి అపోలో హాస్పిటల్స్ ను 1983లో  స్థాపించారు. ఆ తరువాత అపోలో ఫార్మసీ సంస్థను కూడా నెలకొల్పారు. ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశ 100 మంది సంపన్నుల జాబితాలో 86వ స్థానం పొందారు. .2017లో ఇండియా టుడే వెలువరించిన భారతదేశపు 50 శక్తిమంతులైన వ్యక్తుల్లో  డాక్టర్ ప్రతాప్ చంద్రా రెడ్డి కు 48వ స్థానం దక్కింది.  1991లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్,  2010లో పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించింది.