
హైదరాబాద్, వెలుగు: అపోలో హాస్పిటల్స్ నికర లాభం జూన్ క్వార్టర్లో 35 % తగ్గింది. ఈ ఏడాది జూన్ క్వార్టర్లో కంపెనీకి రూ. 323.78 కోట్ల నికర లాభం వచ్చింది. ఖర్చులు పెరిగాయని, రెవెన్యూ గ్రోత్ కొద్దిగానే ఉందని అపోలో హాస్పిటల్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఫలితంగా లాభం తగ్గినట్లు కంపెనీ వివరించింది. అపోలో హాస్పిటల్స్‌కు కిందటి ఏడాది జూన్ క్వార్టర్లో రూ. 500.68 కోట్ల లాభం వచ్చింది. తాజా జూన్ క్వార్టర్లో రెవెన్యూ రూ. 3,795.60 కోట్లకు పెరిగింది. హెల్త్‌కేర్ సర్వీసెస్ విభాగం రెవెన్యూ రూ. 2,032.7 కోట్లని, క్లినిక్స్ విభాగం రెవెన్యూ రూ. 293.01 కోట్లని కంపెనీ పేర్కొంది. ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్ రెవెన్యూ కూడా ఈ ఏడాది జూన్ క్వార్టర్లో కొద్దిగా తగ్గి రూ. 1,472.92 కోట్లకు పరిమితమైనట్లు వెల్లడించింది. మొత్తం ఖర్చు తాజా క్వార్టర్లో రూ. 3,545.36 కోట్లకు పెరిగిందని, వినియోగించిన మెటీరియల్స్ వ్యయమూ రూ. 612.37 కోట్లయిందని అపోలో హాస్పిటల్స్ తెలిపింది.