
- రూ.9 తొమ్మిది చొప్పున డివిడెండ్
న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్ ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్‌కు రూ.146 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో పోస్ట్ చేసిన రూ. 97 కోట్లతో పోలిస్తే లాభం 50శాతం పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 21శాతం పెరిగి రూ.4,302 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఏడాదిలో కంపెనీ ఆదాయం రూ.3,546 కోట్లు ఉంది. 2023 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.5 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు (180శాతం) రూ. తొమ్మిది చొప్పున ఫైనల్డివిడెండ్ను కూడా బోర్డు సిఫార్సు చేసింది. డివిడెండ్ చెల్లింపు కోసం వాటాదారుల అర్హతను నిర్ణయించడానికి కంపెనీ ఆగస్టు 19ని రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది.
తాజా క్వార్టర్లో, కంపెనీ ఇబిటా వార్షికంగా రూ. 463 కోట్ల నుండి 5శాతం పెరిగి రూ. 488 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే క్వార్టర్లో మార్జిన్లు 12శాతం ఉండగా, నాలుగో క్వార్టర్లో ఇవి11శాతానికి పడిపోయాయి. మార్చి క్వార్టర్లో కంపెనీ మొత్తం ఖర్చులు 21శాతం పెరిగాయి. ఈ క్వార్టర్లో హెల్త్‌కేర్ సేవల ఆదాయాలు 18శాతం పెరిగి రూ.2,227 కోట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది క్వార్టర్లో దీని నుంచి రూ.1,879 కోట్లు వచ్చాయి. రిటైల్ హెల్త్ అండ్ డయాగ్నోస్టిక్స్ నుంచి రూ. 308 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది ఏడాది క్రితం రూ. 297 కోట్లతో పోలిస్తే 4శాతం పెరిగింది. డిజిటల్ హెల్త్సెగ్మెంట్ ఆదాయం 31శాతం వృద్ధిని సాధించి రూ.1,799 కోట్లకు చేరుకుంది. పూర్తి సంవత్సరానికి, అపోలో హాస్పిటల్స్ రూ.844 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. 2022లో రూ.14,662 కోట్లుగా ఉన్న ఆదాయాలు 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.16,612 కోట్లకు చేరాయి.