మళ్లా హ్యాకింగ్ లొల్లి .. తమ ఫోన్లను కేంద్రం హ్యాక్ చేస్తుందని ప్రతిపక్ష నేతల ఆరోపణ

మళ్లా హ్యాకింగ్ లొల్లి .. తమ ఫోన్లను కేంద్రం హ్యాక్ చేస్తుందని ప్రతిపక్ష నేతల ఆరోపణ
  • శశిథరూర్, అఖిలేశ్, ఏచూరి, మహువా మొయిత్రా ట్వీట్లు 
  • యాపిల్​ అలర్ట్ మెసేజ్ లు ట్విట్టర్​లో పోస్టు
  • తమకూ అలాంటి మెసేజ్​లే వచ్చాయన్న కేటీఆర్, రేవంత్  
  • ఖండించిన కేంద్రం.. విచారణకు ఆదేశం
  • కొన్నిసార్లు ఫేక్ అలర్ట్ మెసేజ్​లు రావొచ్చని యాపిల్​ వివరణ  

మళ్లీ హ్యాకింగ్ లొల్లి మొదలైంది. కేంద్ర ప్రభుత్వం తమ ఫోన్లను హ్యాక్ చేస్తున్నదని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. మంగళవారం తమకు యాపిల్​ నుంచి అలర్ట్ మెసేజ్ వచ్చిందంటూ కొందరు లీడర్లు ట్విట్టర్​లో పోస్టులు పెట్టారు. వీరిలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఆ పార్టీ నేత పవన్ ఖేరా, సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి, ఎస్పీ ప్రెసిడెంట్ అఖిలేశ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, మంత్రి కేటీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ తదితరులు ఉన్నారు. హ్యాకింగ్ పై రాహుల్ స్పందిస్తూ.. ‘‘మాకేం భయం లేదు. కావాలంటే నా ఫోన్ కూడా ఇస్తాను’’ అని అన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్రం ఖండించింది. దీనిపై విచారణకు ఆదేశించింది. మరోవైపు యాపిల్​ సంస్థ వివరణ ఇస్తూ.. కొన్నిసార్లు ఫేక్ అలర్ట్ మెసేజ్ లు రావొచ్చని పేర్కొంది.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తమ ఐఫోన్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని కొందరు ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఈ మేరకు తమకు యాపిల్​ కంపెనీ నుంచి అలర్ట్ మెసేజ్​లు వచ్చాయని తెలిపారు. ఆ మెసేజ్ లను మంగళవారం ట్విట్టర్ లో పోస్టు చేశారు. ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న హ్యాకర్లు మీ ఫోన్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని యాపిల్​ కంపెనీ పంపిన అలర్ట్ మెసేజ్​లలో ఉంది. ఇదికాస్తా వివాదాస్పదమైంది. అయితే ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అవన్నీ తప్పుడు ఆరోపణలని మండిపడింది. దీనిపై దర్యాప్తుకు ఆదేశించింది. మరోవైపు యాపిల్​ కంపెనీ కూడా దీనిపై వివరణ ఇచ్చింది. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించలేమని తెలిపింది. ఒక్కోసారి నకిలీ అలర్ట్ మెసేజ్ లు కూడా రావొచ్చని పేర్కొంది. 

ప్రజాస్వామ్యంపై దాడి: ప్రతిపక్షాలు 

శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఆ పార్టీ నేత పవన్ ఖేరా, సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి... యాపిల్​ కంపెనీ నుంచి తమకు వచ్చిన అలర్ట్ మెసేజ్ స్ర్కీన్ షాట్​లను ట్విట్టర్​లో షేర్ చేశారు. వాటిని ప్రధానమంత్రి ఆఫీస్, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అకౌంట్లకు ట్యాగ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎంపీలకు రక్షణ కల్పించాలని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు మహువా మొయిత్రా లెటర్ రాశారు. ప్రతిపక్షాలపై ప్రభుత్వం నిఘా పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ప్రధాని మోదీకి రాసిన లెటర్ లో సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ‘‘నా జీవితం తెరిచిన పుస్తకం. దాచడానికి ఏమీ లేదు. నా ఫోన్ ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటే.. అందులో ఏదో ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్ పెట్టి, దాని ఆధారంగా నన్ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారని అర్థమవుతున్నది” అని అందులో పేర్కొన్నారు. 

విచారణకు ఆదేశించాం: కేంద్రమంత్రి

ప్రతిపక్ష లీడర్ల ఆరోపణలను కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొట్టిపారేశారు. ‘‘ప్రతిపక్షాలు ఎప్పుడూ ప్రధాని మోదీని విమర్శిస్తూనే ఉంటాయి. ఏదైనా మేజర్ ఇష్యూ లేనప్పుడు, సర్వైలెన్స్ అంశాన్ని లేవనెత్తుతాయి. గతంలోనూ ఇలాగే చేశాయి. అప్పుడు మేం దర్యాప్తు చేస్తే ఏమీ తేలలేదు” అని చెప్పారు. ‘‘ఒక్క మన దేశంలోనే కాకుండా, 150 దేశాల్లో యాపిల్​ అలర్ట్ మెసేజ్ లు వచ్చాయి. ఒక్కోసారి నకిలీ అలర్ట్ మెసేజ్ లు కూడా వస్తుంటాయని ఆ సంస్థ పేర్కొంది. అయినప్పటికీ దీన్ని మేం సీరియస్ గా తీసుకుని విచారణకు ఆదేశించాం. ‘స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్’ అని చెప్పడంపై విచారణకు రావాలని యాపిల్​ సంస్థను కూడా కోరామని పేర్కొన్నారు. 

మేం భయపడం.. కావాలంటేనా ఫోన్ ఇస్త: రాహుల్ 

అదానీ ఇష్యూపై కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని, అందుకే దృష్టిమళ్లించే రాజకీయాలకు తెరతీసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మాకేం భయం లేదు. మీరు ఎన్ని ఫోన్లు ట్యాప్ చేయాలనుకుంటే అన్ని చేసుకోండి. నా ఫోన్ కూడా కావాలంటే ఇస్తాను” అని రాహుల్ చెప్పారు. ‘‘దేశంలో అదానీదే ఆధిపత్యం. ఆయన తర్వాతే మోదీ, అమిత్ షా. అదానీ వ్యవహారం లేవనెత్తగానే దర్యాప్తు సంస్థలు మాపై నిఘా పెడుతున్నాయి” అని ఆరోపించారు. తన ఆఫీస్ సిబ్బంది, తమ పార్టీ నేతలు కేసీ వేణుగోపాల్, సుప్రియా శ్రీనటే, పవన్ ఖేరా, టీఎస్ సింగ్ దేవ్ తో పాటు ప్రతిపక్ష లీడర్లు అఖిలేశ్ యాదవ్ తదితరులకు యాపిల్​ అలర్ట్ మెసేజ్ లు వచ్చాయని తెలిపారు. కాగా, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు కూడా అలర్ట్ మెసేజ్ వచ్చినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

నకిలీ మెసేజ్​లు కూడారావొచ్చు: యాపిల్​

యాపిల్​ అలర్ట్ మెసేజ్ లు వివాదాస్పదం కావడంతో ఆ సంస్థ స్పందించింది. దీన్ని అధికారికంగా పనిచేసే హ్యాకర్ల పనిగా ఆపాదించలేమని తెలిపింది. కొన్నిసార్లు నకిలీ అలర్ట్ మెసేజ్ లు కూడా రావొచ్చని చెప్పింది. కొన్ని దాడులను గుర్తించలేం కూడా అని పేర్కొంది. అయితే ఎంపీలకు ఎందుకు అలర్ట్ మెసేజ్ లు వచ్చాయనేది మాత్రం వెల్లడించలేదు.