Apple : దేశంలో తొలి అధికారిక రిటైల్ స్టోర్ ఓపెన్ చేయనున్న ఆపిల్

Apple : దేశంలో తొలి అధికారిక రిటైల్ స్టోర్ ఓపెన్ చేయనున్న ఆపిల్

చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత అతిపెద్ద స్మార్ ఫోన్ కంపెనీ అయిన  ఆపిల్ ఎట్టకేలకు భారత్ లో సొంత బ్రాండెడ్ రిటైల్ స్టోర్‌ను ఓపెన్ చేసేందుకు మార్గం సుగమమైంది. ఈ విషయాన్ని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్  కూడా ధ్రువీకరించారు. ఈ రిటైల్ స్టోర్ ను ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ప్రారంభించనుంది. దీన్ని ఏప్రిల్ నెలలో ఓపెన్ చేయడానికి కంపెనీ ప్లాన్ చేస్తు్న్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఢిల్లీలోనూ మరో రిటైల్ స్టోర్ ను ప్రారంభించే అవకాశమున్నట్టు సమాచారం. 
 
లాస్‌ ఏంజిల్స్‌, న్యూయార్క్‌, బీజింగ్‌, సింగపూర్‌, మిలాన్‌ వంటి నగరాల తర్వాత ముంబైలోనే ఆపిల్‌ ఐ-ఫోన్‌ రిటైల్‌ స్టోర్‌ ఏర్పాటు కానుండడం చెప్పుకోదగిన విషయం. దీన్ని ముంబైలోని జియో వరల్డ్‌ డ్రైవ్‌ మాల్‌లో 22 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్టు ఇప్పటికే పలు వార్తా కథనాలు ప్రచురించాయి.  ఇటీవల త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత ఇన్వెస్టర్ల తో సమావేశం సందర్భంగా, కంపెనీ సీఈఓ కుక్.. త్వరలోనే ఇండియాలో తమ రిటైల్ స్టోర్ ను ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలో ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్ 2020లో ప్రారంభించగా..  ఇప్పుడు ఆఫ్ లైన్ స్టోర్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది కంపెనీతో పాటు, వినియోగదారులకు నిర్దిష్ట ప్రయోజనాలను అందిస్తుందని ఆ కంపెనీ భావిస్తోంది. ఫలితంగా ఇండియాలో తమ మార్కెట్ మరింత వృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.