ప్రొడక్ట్ ఏదైనా సరే... యూజర్ల సేఫ్టీ, ప్రైవసీకి టెక్ కంపెనీలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాయి. అందుకనే ట్రెండ్‌ని బట్టి, అవసరాల్ని బట్టి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటాయి. యాపిల్ కూడా త్వరలోనే కొత్త అప్డేట్స్ని తీసుకురాబోతోంది. వాటిలో ముఖ్యమైనది మాల్వేర్ హ్యాకర్ల బారిన పడకుండా చూసేందుకు ‘లాక్డౌన్ మోడ్’ ఫీచర్. ప్రమాదాన్ని గుర్తించి యూజర్లకు అలర్ట్స్ పంపించే ఎయిర్‌పాడ్స్ తీసుకురానుంది. ఇవేకాకుండా పెద్ద స్క్రీన్, బ్యాటరీ ఉన్న స్పోర్ట్స్ వాచీలు కూడా తెస్తున్నట్టు చెప్పింది యాపిల్. స్మార్ట్‌ఫోన్‌లో స్పైవేర్, మాల్వేర్కి కారణమయ్యే పెగాసస్ వంటి కంపెనీ హ్యాకర్ల నుంచి సెక్యూరిటీ కోసం ‘లాక్డౌన్’ ఫీచర్ తీసుకురాబోతోంది యాపిల్. ఈ ఫీచర్ యూజర్ల సమాచారం, వివరాలు హ్యాకర్ల బారిన పడకుండా చూస్తుంది. ఇదెలా పనిచేస్తుందంటే... స్మార్ట్‌ఫోన్‌లోకి హ్యాకర్లు ఈజీగా యాక్సెస్ అయ్యే దారుల్ని మూసేస్తుంది. ముఖ్యమైన మెసేజ్ ఫైళ్లని, ఫేస్‌టైమ్ నుంచి వచ్చే సర్వీస్ రిక్వెస్ట్‌లను బ్లాక్ చేస్తుంది. జావా స్క్రిప్ట్‌ని డిసేబుల్ చేసి, కంప్యూటర్‌తో యాపిల్ ఫోన్‌కి ఉన్న వైర్ కనెక్షన్‌ని బ్లాక్ చేయడం ద్వారా యూజర్ల వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కకుండా చూస్తుంది. ఈ ఫీచర్ ఐఫోన్‌తో పాటు ఐపాడ్, మ్యాక్‌లో కూడా పనిచేస్తుంది. అంతేకాదు, యాపిల్‌లో మాల్వేర్ని కనిపెట్టినవాళ్లకు రెండు మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు రెడీగా ఉంది. అయితే, ఈ ఫీచర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనేది చెప్పలేదు.
అలర్ట్ చేసే ఎయిర్ పాడ్స్
ప్రమాదాన్ని ముందే పసిగట్టి, అలర్ట్ చేసే ఎయిర్‌పాడ్స్ తయారుచేయనుంది. ఈ సేఫ్టీ ఫీచర్ మీద పేటెంట్ కూడా తీసుకుంది యాపిల్. ఏదైనా ప్రమాదం ఎదురయ్యేముందు అలర్ట్ చేస్తుంది. అదెలాగంటే... ట్రాఫిక్‌లో, జనం ఎక్కువ ఉన్నచోట ఇయర్‌బడ్స్ పెట్టుకొని పాటలు వింటుంటే బయటి శబ్దాలు వినిపించవు. అప్పుడు ఈ ఎయిర్‌పాడ్స్ ఆటోమెటిక్‌గా వాల్యూమ్‌ని తగ్గిస్తాయి. పాజ్ కూడా చేస్తాయి. అందుకోసం ఐఫోన్ లేదా యాపిల్ వాచీలోని జీపిఎస్ డేటాని ఎయిర్‌పాడ్స్‌లో ఉన్న సెన్సర్లతో కలుపుతుంది. యూజర్లు బైక్ నడుపుతున్నా, సైకిల్ తొక్కుతున్నా ఎంత స్పీడ్‌గా వెళ్తున్నారు? వాళ్లు ఉన్న లొకేషన్? ఒక ఎయిర్ ప్యాడ్ పెట్టుకున్నారా? రెండు ఎయిర్‌ప్యాడ్స్ పెట్టుకున్నారా? అనే దాన్ని బట్టి అలర్ట్స్ వస్తాయి.
స్పోర్ట్స్ వెర్షన్ వాచీలు
త్వరలోనే స్పోర్ట్స్ వెర్షన్ వాచీలు తీసుకురానుంది యాపిల్. స్టాండర్డ్ యాపిల్ వాచీలతో పోలిస్తే వీటి స్క్రీన్, బ్యాటరీ పెద్దగా ఉంటాయి. వీటి తయారీలో అల్యూమినియం బదులు మెటల్ వాడతారు. వీటి డిస్ప్లే 2 ఇంచులు ఉంటుంది. రెజల్యూషన్ కూడా 502 పిక్సెల్ ఉండనుంది. వీటిలో ఎస్8 ప్రాసెసర్ వాడతారు. ఈ వాచీల స్క్రీన్ పెద్దగా ఉండడంతో యాపిల్ క్లౌడ్ మరిన్ని ఫిట్నెస్ వివరాలు చూపిస్తుంది. ముఖ్యంగా అథ్లెట్లకు ఫిట్నెస్ సమాచారం తెలుసుకునేందుకు ఈ వాచీ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు, యూజర్ల బాడీ టెంపరేచర్ని బట్టి జ్వరం ఉందా? లేదా? అనేది చెప్తుంది. వీటితో పాటు ఈ ఏడాది చివరికల్లా కొత్తగా మూడు 8 సిరీస్ వాచీలు తేనుంది యాపిల్.
ఇవి బడ్జెట్ ట్యాబ్లెట్స్
లాక్డౌన్ టైం నుంచి ఆన్లైన్ క్లాస్‌లకు అలవాటు పడ్డారు పిల్లలు. దాంతో వాళ్లకోసం స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ కొన్నారు చాలామంది తల్లిదండ్రులు. అప్పుడు కొననివాళ్లు తక్కువ బడ్జెట్లో మంచి ట్యాబ్లెట్స్ దొరికితే బాగుండు అనుకుంటారు. అలాంటివాళ్ల కోసమే ఈ బడ్జెట్ ట్యాబ్లెట్స్. కంపెనీ, ఫీచర్లని బట్టి ధర ఉంటుంది.
వాటిలో కొన్నింటి వివరాలివి...
యాపిల్ ఐపాడ్ 9వ జనరేషన్: దీనిలో ట్రూ టోన్ టెక్నాలజీ ఉన్న 10.2 ఇంచు రెటీనా డిస్ప్లే ఉంటుంది. దాంతో వీటిలో ఫొటోలు, వీడియోలు నేచురల్‌గా కనిపిస్తాయి. ఇందులోని పవర్ఫుల్ ఎ13 బయోనిక్ చిప్ వల్ల ఇవి 20 శాతం మెరుగ్గా పనిచేస్తాయి. క్రోమ్‌బుక్‌తో పోల్చితే వీటి టచ్ స్పీడ్ 3 రెట్లు ఎక్కువ. అంటే... ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ల కంటే ఆరు రెట్లు ఎక్కువ. ఒఎస్ 15 ఉన్న వీటిలో సెంటర్ స్టేజ్ ఫీచర్ ఉంటుంది. దాంతో యూజర్లు జూమ్ కాల్లో అటుఇటు కదిలినా కూడా డిస్ప్లే విండో మధ్యలో కనిపిస్తారు. వీటిలో వైఫై మోడల్స్ రూ. 30 వేల నుంచి దొరుకుతున్నాయి.
నోకియా టి20... వీటి డిస్ప్లే10.36 ఇంచులు ఉంటుంది, 2,000.1,200 పిక్సెల్ రెజల్యూషన్ ఉన్న ఎల్సిడి కెమెరా ఉంటుంది. ఐపి(ఇంగ్రెస్ ప్రొటెక్షన్ కోడ్)54 ఉండడంతో వీటిమీద దుమ్ము, నీళ్లు పడినా పాడుకావు. 8 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 8,200 ఎంఎహెచ్బ్యాటరీ ఉంటుంది. వీటిలో 3జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్ ఉన్న వాటి ధర రూ. 15,499. 4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ ఉన్న వాటి ధర రూ.16,499.
