న్యూఢిల్లీ: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), టెక్ కంపెనీ యాపిల్ మధ్య వివాదం ముదరుతోంది. యాపిల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందని సీసీఐ ఆరోపిస్తుండగా, విచారణ కోసం కంపెనీ గ్లోబల్ ఫైనాన్షియల్ రికార్డ్స్‌ను సీసీఐ కోరిందని యాపిల్ తెలిపింది. విచారణను ఆపాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది.
సీసీఐ కిందటి నెల 31న యాపిల్ నుంచి గ్లోబల్ ఫైనాన్షియల్ రికార్డులను కోరింది. యాపిల్ వాదన ప్రకారం, గ్లోబల్ టర్నోవర్ ఆధారంగా జరిమానా విధిస్తే అది 38 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.45 లక్షల కోట్ల) వరకు చేరొచ్చు. 2024 నాటి పెనాల్టీ రూల్స్‌ను యాపిల్ కోర్టులో సవాలు చేసింది. సీసీఐ చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరింది.
