
- రెడీ అయిన ఫాక్స్‌కాన్ బెంగళూరు ప్లాంట్
- తమిళనాడులోని టాటా ప్లాంట్‌లోనూ ప్రొడక్షన్ స్టార్ట్
- వాణిజ్య యుద్ధమే కారణం
న్యూఢిల్లీ: యాపిల్ ఇండియాలో తన ఐఫోన్ల తయారీని మరింత పెంచాలని నిర్ణయించుకుంది. చైనా నుంచి కొంత తయారీ సామర్ధ్యాన్ని తరలించాలని ప్లాన్ చేస్తోంది. తమిళనాడులో టాటా ఎలక్ట్రానిక్స్ ద్వారా ఒక కొత్త ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్, కర్ణాటకలో ఫాక్స్‌కాన్ ద్వారా మరొక ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. యూఎస్, చైనా మధ్య ముదిరిన ట్రేడ్ వార్‌తో ఎక్కువగా నష్టపోతోంది యాపిల్ కంపెనీనే.
అమెరికా, ఇండియా మధ్య ట్రేడ్ డీల్ కుదరనుండడంతో కంపెనీ చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటోంది. ఇండియాలో యాపిల్ ఫోన్ల తయారీ రెట్టింపు అవుతుందని, మరిన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని ఎనలిస్టులు చెబుతున్నారు.
టాటా కొత్త ప్లాంట్
రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం, తమిళనాడులోని హోసూర్‌లో టాటా ఎలక్ట్రానిక్స్ ఒక కొత్త ఐఫోన్ అసెంబ్లీ యూనిట్‌ను ఇప్పటికే ప్రారంభించింది. ఈ ప్లాంట్ ప్రస్తుతం ఒకే ఉత్పత్తి లైన్‌తో పనిచేస్తుండగా, పాత ఐఫోన్ మోడళ్లను ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తున్నారు. 2023లో విస్ట్రాన్‌కి చెందిన ఐఫోన్ తయారీ వ్యాపారాన్ని టాటా ఎలక్ట్రానిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఫాక్స్‌కాన్ బెంగళూరు ప్లాంట్ రెడీ
ఇదే సమయంలో, యాపిల్‌కు అతిపెద్ద తయారీ భాగస్వామిగా కొనసాగుతున్న ఫాక్స్‌కాన్, కర్ణాటకలోని బెంగళూరులో సుమారు రూ.20 వేల కోట్లతో నిర్మించిన కొత్త ప్లాంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16ఈ వంటి కొత్త ఐఫోన్ మోడళ్లను తయారు చేయనున్నారు. ఈ ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో గంటకు 300 నుంచి 500 ఐఫోన్‌లను ఉత్పత్తి చేయొచ్చు. ఇందులో డిసెంబర్ 2027 నాటికి పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అంచనా. ఇక్కడ 50 వేల మంది పనిచేయనున్నారు.
యాపిల్ స్ట్రాటజీలో మార్పు
ఈ ఏడది చైనీస్ వస్తువులపై యూఎస్ సుంకాలు విధించినప్పుడు , యాపిల్ సుమారు 600 టన్నుల ఐఫోన్లను ఇండియా నుంచి వేగంగా యూఎస్‌కు ఎగుమతి చేయాల్సి వచ్చింది. సుంకాల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కంపెనీ వివిధ చర్యలు తీసుకుంటోంది. యూఎస్‌కు వెళ్లే ఐఫోన్‌లను ఎక్కువ భాగం లేదా అన్నింటినీ భారతదేశంలో అసెంబుల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే, ఐఫోన్ 18, ఫోల్డబుల్ ఐఫోన్ వంటి భవిష్యత్ మోడళ్లను ఇండియాలో అసెంబుల్ చేయకపోవచ్చు. యాపిల్ ఇప్పటివరకు కొత్త మోడల్‌ను చైనాకు వెలుపల తయారు చేయలేదు. అయినప్పటికీ, యాపిల్ స్ట్రాటజీలో ఇండియాకు ప్రాధాన్యత పెరుగుతోందనడంలో సందేహం లేదు.