అపాయింట్​ అయిన సీనియర్ సైంటిస్ట్ కళైసెల్వి

అపాయింట్​ అయిన సీనియర్ సైంటిస్ట్ కళైసెల్వి
  • రీసెర్చ్​లో 25 ఏండ్ల ఎక్స్​పీరియన్స్
  • లిథియం బ్యాటరీ రంగంలో విశేష కృషి

న్యూఢిల్లీ: కౌన్సిల్​ ఆఫ్​ సైంటిఫిక్​ అండ్​ ఇండస్ట్రియల్​ రీసెర్చ్​ (సీఎస్​ఐఆర్) డైరెక్టర్​ జనరల్​గా సీనియర్ సైంటిస్ట్​ నల్లతంబి కళైసెల్వి నియమితులయ్యారు. సీఎస్ఐఆర్​కు  నల్లతంబియే తొలి మహిళా డైరెక్టర్​ జనరల్​ కావడం విశేషం. దేశ వ్యాప్తంగా 38 రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్లు​ ఉన్నాయి. ఏప్రిల్​లో శేఖర్​ మండే రిటైర్​ కావడంతో డిపార్ట్​మెంట్​ ఆఫ్​ బయోటెక్నాలజీ సెక్రటరీ రాజేశ్​ గోఖలే సీఎస్​ఐఆర్​ డైరెక్టర్​ జనరల్​గా అదనపు బాధ్యతలు చేపట్టారు. లిథియం బ్యాటరీ రంగంలో కళైసెల్వి చేసిన విశేష కృషికి గాను గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఆమె.. తమిళనాడు కారైకుడిలోని సీఎస్​ఐఆర్​ సెంట్రల్​ ఎలక్ట్రో కెమికల్​ రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్​కు డైరెక్టర్​గా వ్యవహరిస్తున్నారు. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ సైంటిఫిక్​ అండ్​ ఇండస్ట్రియల్​ రీసెర్చ్​ సెక్రటరీగానూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం సీఎస్​ఐఆర్​ డైరెక్టర్​గా నియమిస్తూ సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదివారం ఉత్తర్వులిచ్చింది. రెండేండ్లపాటు ఆమె పదవిలో కొనసాగుతారని పేర్కొంది. ఫిబ్రవరి 2019లో సెంట్రల్​ ఎలక్ట్రో కెమికల్​ రీసెర్చ్​ ఇని​స్టిట్యూట్​ (సీఎస్​ఐఆర్​– సీఈసీఆర్ఐ) చీఫ్​గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా సైంటిస్ట్​గానూ  ఆమె రికార్డుకెక్కారు.  ఇదే ఇని​స్టిట్యూట్​లో ఆమె ఎంట్రీ లెవల్​ సైంటిస్ట్​గా కెరీర్​ప్రారంభించారు. తమిళనాడు.. తిరునల్వేలి జిల్లాలోని అంబసముద్రంలో జన్మించిన కళైసెల్వి..  రీసెర్చ్​లో 25 ఏండ్లకు పైగా అనుభవం గడించారు. ముఖ్యంగా ఎలక్ట్రో కెమికల్​ పవర్​ సిస్టమ్స్​పై ఆమె దృష్టి పెట్టారు. ఎలక్ట్రో మెటీరియల్​ డెవలప్​మెంట్​కు కృషి చేశారు. కళైసెల్వి వద్ద 125కు పైగా రీసెర్చ్​ పేపర్లు, 6  పేటెంట్​ హక్కులు ఉన్నాయి.