కేసీ కాలువలో పడి హైదరాబాద్ కానిస్టేబుల్ గల్లంతు

కేసీ కాలువలో పడి హైదరాబాద్ కానిస్టేబుల్ గల్లంతు

కర్నూలు: కె.సి కాలువలో పడి కానిస్టేబుల్ గల్లంతైన ఘటన జిల్లా సరిహద్దులోని చాగలమర్రి వద్ద జరిగింది. హైదరాబాద్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్రీరామ్ రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో తిరుమల దైవదర్శనానికి వెళ్లారు. నిన్న రాత్రి హైదరాబాదుకు తిరుగు పయనం అయ్యారు. తెల్లవారుజామున కడప జిల్లా మీదుగా కర్నూలు జిల్లాలోకి ప్రవేశించాక చాగలమర్రి మండలంలోని ఇడమడక సమీపంలో కర్నూలు-కడప కాలువ దగ్గర కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆగారు. శ్రీరామ్‌ బహిర్భూమి వెళ్ళి వచ్చి స్నానానికి  కాలువలోకి దిగాడు. అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రమాదవశాత్తు నీటిలో జారి పడి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి కేకలు వేశారు. నీటి ఉధృతిలో శ్రీరామ్ కొట్టుకుపోవడం గుర్తించి అక్కడే ఉన్న కొంత మంది యువకులు వీరికి సహాయంగా వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న కడప జిల్లా దువ్వూరు ఎస్‌ఐ రాజు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎస్‌ఐ విపత్తు దళాలు, స్థానికులచే కె.సి కెనాల్ వెంట గాలింపు చర్యలు చేపట్టారు.