AR Rahman Daughters : 'విబేధించండి.. కానీ వ్యక్తిత్వ హననం చేయకండి'.. రెహ్మాన్ కుమార్తెల ఎమోషనల్ పోస్ట్ వైరల్ !

AR Rahman Daughters : 'విబేధించండి.. కానీ వ్యక్తిత్వ హననం చేయకండి'.. రెహ్మాన్ కుమార్తెల ఎమోషనల్ పోస్ట్ వైరల్ !

భారతీయ సినీ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ వివాదంలో చిక్కుకున్నారు. బాలీవుడ్‌లో మతపరమైన ధోరణులు ఉన్నాయని, అలాగే ‘ఛావా’ వంటి చిత్రాలు విభజన రాజకీయాలను క్యాష్ చేసుకుంటున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా తాను ముస్లిం కావడం వల్లే బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయన్న ఆయన మాటలు వార్తలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. నెటిజన్లు ఆయనను విమర్శిస్త.., ట్రోల్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెహ్మాన్ కుమార్తెలు ఖతీజా, రహీమా తమ తండ్రికి మద్దతుగా గళం విప్పారు.

విబేధించండి.. కానీ అవమానించకండి!

రెహ్మాన్‌పై జరుగుతున్న వ్యక్తిగత దాడులను నిరసిస్తూ మలయాళ సంగీత దర్శకుడు కైలాస్ మీనన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘ పోస్ట్ రాశారు. "Disagree, Don’t Disgrace" (విబేధించండి, కానీ అవమానించకండి) అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ పోస్ట్‌ను రెహ్మాన్ కుమార్తెలు ఖతీజా, రహీమా తమ ఇన్‌స్టా స్టోరీల్లో షేర్ చేస్తూ తండ్రి పట్ల తమకున్న ప్రేమను, మద్దతును చాటుకున్నారు.

"రెహ్మాన్ తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పారు. అది ఆయన ప్రాథమిక హక్కు. ఆయన అభిప్రాయంతో మీరు విబేధించవచ్చు, కానీ తన అనుభవాన్ని పంచుకునే స్వేచ్ఛను హరించలేరని కైలాస్ మీనన్ అన్నారు.. విమర్శల పేరుతో ఒక ప్రపంచ స్థాయి కళాకారుడిని 'దేశానికి అవమానం' అని పిలవడం, ఆయన మతాన్ని ప్రశ్నించడం, బాధితుడి కార్డు వాడుతున్నారని ఎద్దేవా చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇది విమర్శ కాదు, ద్వేషపూరిత ప్రసంగం అంటూ తన నోట్ లో కైలాస్ పేర్కొన్నారు.

తండ్రి గౌరవాన్ని కాపాడుతూ..

దశాబ్దాల కాలంగా భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రెహ్మాన్ పట్ల జరుగుతున్న 'క్యారెక్టర్ అస్సాసినేషన్' (వ్యక్తిత్వ హననం)పై కైలాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సినిమా గురించో, ఒక అభిప్రాయం గురించో చర్చ జరగడం సహజమని, కానీ ఒక గొప్ప కళాకారుడిని బహిరంగంగా అవమానించడం మన సంస్కృతి కాదని ఆయన గుర్తు చేశారు. దీనికి రెహ్మాన్ పెద్ద కుమార్తె ఖతీజా ఈ పోస్ట్‌కు హార్ట్ ,  క్లాప్స్ ఎమోజీలతో స్పందించడమే కాకుండా, తన కష్టకాలంలో పలకరించిన స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతూ మరో భావోద్వేగపూరిత నోట్‌ను పంచుకున్నారు. రెండవ కుమార్తె రహీమా కూడా కైలాస్ రాసిన అక్షరాలు అక్షర సత్యాలన్నట్లుగా రీ-పోస్ట్ చేశారు.

అసలు వివాదం ఎక్కడ మొదలైంది?

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రెహ్మాన్ మాట్లాడుతూ.. ముస్లిం అని పిలవబడే వ్యక్తులకు బాలీవుడ్‌లో పక్షపాత వైఖరి ఎదురవుతోందని అభిప్రాయపడ్డారు. అలాగే పీరియడ్ డ్రామా చిత్రాలు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి వసూళ్లు సాధిస్తున్నాయని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు రెహ్మాన్ మాటల్లో నిజముందని అంటుంటే, మరికొందరు ఆయనను 'విక్టిమ్ కార్డ్' వాడుతున్నారని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా, భారతీయ సంగీత సామ్రాజ్యంలో రారాజుగా వెలుగొందిన రెహ్మాన్ చుట్టూ ఇప్పుడు వివాదాలు ముసురుకోవడం విచారకరం. అయితే ఆయన కుటుంబం మాత్రం ఆయన వెంటే ఉంటూ, భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలని కోరుతోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kailas (@kailasmenon2000)