రియాద్: మౌలిక సదుపాయాలు, చమురు కేంద్రాలే లక్ష్యంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరుపుతున్న దాడులను అరబ్–ఇస్లామిక్ కూటమి ఖండించింది. ఈ మేరకు గురువారం రియాద్‌లో అత్యవసర సమావేశం నిర్వహించింది. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మాట్లాడుతూ.. తమ సహనానికి కూడా హద్దు ఉంటుందన్నారు.
అవసరమైతే సైనిక చర్య సహా అన్ని మార్గాలను పరిశీలిస్తున్నామని హెచ్చరించారు. సమావేశానికి హాజరైన యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఈజిప్ట్, జోర్డాన్, తుర్కియే, పాకిస్థాన్ దేశాల విదేశాంగ మంత్రులు ఇరాన్ చర్యలను తప్పుబట్టారు. చమురు క్షేత్రాలు, నీటి శుద్ధి ప్లాంట్లు, విమానాశ్రయాలు, నివాస ప్రాంతాలపై ఇరాన్ కావాలనే దాడులు చేస్తోందని కూటమి ఆరోపించింది. ఐక్యరాజ్య సమితి చార్టర్ లోని ఆర్టికల్ 51 ప్రకారం.. ఏ దేశమైనా తనపై దాడి జరిగినప్పుడు ఆత్మరక్షణ కోసం ప్రతిఘటించే హక్కు కలిగి ఉంటుందని గుర్తు చేసింది.
