
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ పథకానికి ఈసారి ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. చీరల తయారీకి అవసరమైన యార్న్ కొరత, బిల్లుల బకాయిలతో కార్మికులకు కూలీ చెల్లింపు లేటవడం, కార్మికుల ఆందోళనలు వంటి వాటితో చీరల తయారీలో జాప్యం జరిగింది. 6.5 కోట్ల మీటర్ల వస్త్రం తయారుచేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు సుమారు మూడు కోట్ల మీటర్లే తయారైంది. మరో నెల రోజుల్లోనే (వచ్చే నెల 15వ తేదీ నాటికి) మిగతా మూడున్నర కోట్ల మీటర్లు ఉత్పత్తి చేయడం సాధ్యంకాని పని అని వస్త్ర పరిశ్రమ పెద్దలే ఉంటున్నారు. మరి పంపిణీకి చీరలు తక్కువపడితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆడపడుచులకు కానుకగా..
తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా ప్రభుత్వం చీరలు ఇస్తోంది. సిరిసిల్ల నేతన్నల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చీరల తయారీ ఆర్డర్లను మొత్తం సిరిసిల్లకు అప్పగించారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని చేనేత, జౌళిశాఖ పర్యవేక్షిస్తుంది. 2017లో ఈ బతుకమ్మ చీరల పథకం ప్రారంభించారు. కానీ ఆ ఏడాది సరైన సమయంలో బతుకమ్మ చీరలు పంపణీ చేయకపోవడం, తమిళనాడు, సూరత్ నుంచి నాసిరకం చీరలు తేవడంతో సర్కారుపై విమర్శలు వచ్చాయి. దాంతో 2018లో కాస్త ప్రణాళికతో వ్యవహరించడంతో చీరల పంపిణీ సజావుగా జరిగింది. కానీ ఈసారి మళ్లీ మొదటికి వచ్చింది. సిరిసిల్ల నేతన్నలకు చీరల ఆర్డర్ ఇచ్చినా కొన్ని సమస్యలతో తయారీలో తీవ్ర జాప్యం నెలకొంది.
యార్న్ కొరతతో..
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 30 మరమగ్గాలు ఉండగా.. 20 మంది కార్మికులు పని చేస్తున్నారు. బతుకమ్మ చీరల తయారీని మ్యాక్స్(మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ సొసైటీ), ఏఎస్ఐ యూనిట్లు ఏర్పాటు చేసి ఆర్డర్లు అప్పగించారు. అయితే కూలీ ఒప్పందం విషయంలో కార్మిక సంఘాల నేతలు బంద్కు పిలుపునివ్వడం, కూలీ రేట్లు ఫిక్స్కాకపోవడంతో ఆలస్యమైంది. మ్యాక్స్ సంఘాలు ముడి సరుకులను సర్కారు సూచించిన కంపెనీల నుంచే కొనుగోలు చేయాలన్న నిబంధన పెట్టారు. కానీ ఆ కంపెనీలు సకాలంలో యార్న్అందించకపోవడంతో మరింత జాప్యం జరిగింది. మొత్తంగా 2019లో బతుకమ్మ చీరల పంపిణీ కోసం సర్కారు 6.50 కోట్ల మీటర్ల వస్త్రం తయారీకి ఆర్డర్లు ఇచ్చింది. ఏప్రిల్ లోనే ఉత్పత్తి ప్రారంభం కావల్సి ఉండగా.. మే మధ్యలో మొదలైంది. అదికూడా 40 శాతం మగ్గాలపైనే తయారీ ప్రారంభించినట్టు అంచనా. దాంతో ఇప్పటివరకు అంటే మూడు నెలల వ్యవధిలో మూడు కోట్ల మీటర్ల వస్త్రం మాత్రమే తయారైంది. గడువు మేరకు సెప్టెంబర్ 15వ తేదీలోగా మొత్తం ఆర్డర్ పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలి. అంటే కేవలం 35–40 రోజుల్లోనే మూడున్నర కోట్ల మీటర్ల పొడవైన చీరలు తయారు చేయాల్సి ఉంది.
తక్కువ పడితే ఎలా?
మూడు నెలల్లో మూడు కోట్ల మీటర్ల వస్త్రం తయారైతే.. నెలా ఐదు రోజుల్లో మూడున్నర కోట్ల మీటర్లు ఎలా తయారు చేయగలరన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల కోసం ఆర్డర్లు ఇచ్చినప్పటికీ.. తొంభై శాతం మగ్గాలు సిరిసిల్లలోనే ఉన్నాయి. మొత్తం మగ్గాలన్నింటినీ ప్రారంభించినా, రాత్రింబవళ్లు నడిపించినా.. సర్కారు నిర్ణయించిన లక్ష్యంలో 80 శాతమైనా చేరే అవకాశం కనిపించడం లేదని వస్త్ర పరిశ్రమ పెద్దలు అంటున్నారు. మరి తక్కువ పడే వస్త్రాన్ని ఎక్కడి నుంచి తీసుకువస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.