రక్షణ సంస్థల సమీపంలో అక్రమ నిర్మాణాలా?..ఇలాంటివి దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం: హైకోర్టు

రక్షణ సంస్థల సమీపంలో అక్రమ నిర్మాణాలా?..ఇలాంటివి దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం: హైకోర్టు
  • అక్రమ నిర్మాణాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం 
  • వోడా చట్టం అమలుకు తాజా నోటిఫికేషన్‌‌ ఇవ్వాలని కేంద్రానికి సూచన    

హైదరాబాద్, వెలుగు: మేడ్చల్‌‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌‌పేట మండలం బౌరంపేట గ్రామ పరిధిలో రక్షణ శాఖకు చెందిన సంస్థల సమీపంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలు దేశ అంతర్గత భద్రతకు ప్రమాదమని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రక్షణ సంస్థల సమీపంలోని అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే వోడా (వర్క్స్‌‌ ఆఫ్‌‌ డిఫెన్స్‌‌ యాక్ట్‌‌) చట్టంలోని సెక్షన్‌‌ 3 అమలుకు సంబంధించి ఈ డిసెంబరులోగా తాజాగా నోటిఫికేషన్‌‌ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

ఒకవేళ ఇప్పటికే నోటిఫికేషన్‌‌ జారీ చేసినట్లయితే దాన్ని ప్రచురించిన తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు పరిగణించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించింది. బౌరంపేటలోని సర్వే నెం.345/పీ, 347/పీ పరిధిలో రక్షణ శాఖ నుంచి ఎన్ఓసీ లేకుండా రక్షణ సంస్థల సమీపంలో ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేపడుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ రక్షణ శాఖ హైకోర్టులో పలు పిటిషన్‌‌లు దాఖలు చేసింది. వీటిపై జస్టిస్‌‌ టి.వినోద్‌‌కుమార్‌‌ విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించారు. 

వోడా చట్టంలోని సెక్షన్‌‌ 3 కింద నోటిఫికేషన్‌‌ జారీ చేసి, దాని అమలుకు కేంద్రం చర్యలు తీసుకోకపోవడం సరికాదని జడ్జి తీర్పులో పేర్కొన్నారు. కేంద్రం తాజాగా నోటిఫికేషన్‌‌ జారీ చేసేదాకా బౌరంపేటలో ప్రైవేటు వ్యక్తులు రక్షణ సంస్థల సమీపంలో చేపట్టిన నిర్మాణాలను నిలిపివేయాలని ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు దేశ అంతర్గత భద్రతకు ప్రమాదమని, అందువల్ల వాటిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌‌ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.